ప్రస్తుతం తెదేపా, వైకాపాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరు పక్షాల నేతలు ఒకరిపై మరొకరు అస్త్రశస్త్రాలు సందించుకొంటున్నారు. ఆ భీకర యుద్ధం మద్యలో తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండు నిలువుటద్దాలు తెచ్చి పెట్టారు. వాటి పేర్లు నారాయణ, ప్రట్టిపాటి పుల్లారావు. వారిరువురూ రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భారీగా భూములు కొన్నారని వైకాపాకి మనసాక్షి సాక్షి పత్రిక ప్రకటించడంతో ఇటువంటి యుద్ద సమయాలలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే బొండా ఉమామహేశ్వరరావు వెంటనే ఆ ఆరోపణలు త్రిప్పికొట్టేందుకు ఈ నిలువుటద్దాల ప్రసక్తి తెచ్చారు.
“మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ ఇద్దరూ కూడా నీతి నిజాయితీకి నిలువుటద్దాలవంటివారు. భూసేకరణకు, భూసమీకరణకు తేడా గుర్తించకుండా మా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే వైకాపా నేతలు ఇటువంటి లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో ఎవరో వ్యక్తులు భూములు కొనుకొంటే వాటికీ మా మంత్రులకి ముడిపెడుతూ సాక్షిలో కట్టుకధలు ప్రచురిస్తోంది. దాని వలన మా వ్యక్తిగత, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. అందుకు సాక్షి మీడియాపై, జగన్మోహన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయబోతున్నాము. దానిని ఎదుర్కొనేందుకు జగన్ సిద్దంగా ఉండాలి. త్వరలోనే జగన్ తో సహా ఇటువంటి నిరాధారమయిన ఆరోపణలు చేసినవారందరికీ నోటీసులు పంపిస్తాము. జగన్మోహన్ రెడ్డి నిత్యం సిబిఐ, కోర్టుల చుట్టూ తిరగడం అలవాటయిపోయింది కనుకనే అతను సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నట్లున్నారు,” అని బొండా ఉమామహేశ్వరరావు ఘాటుగా జవాబు చెప్పారు.