ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. పవన్ కల్యాణ్‌కు చిత్తూరు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా చూపించారు. సైకో పోలీస్ గా విమర్శలు ఎదుర్కొంటున్న అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు పవన్ కు సమయం ఇచ్చిన ఆయన… ఆ సంగతి ఏమీ చెప్పకుండా… ఇటీవల్ల వాలంటీర్ వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ ను వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసు వ్యవస్థకు సమర్పించాలని ఎస్పీ కోరారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు కూడా పెట్టారు. ఆయనపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో… నేరుగా పోలీసుల వద్దకే వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడంతో… ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయన వద్ద వివరణ కోసం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పవన్ ఏం సమాధానం ఇచ్చారో స్పష్టత లేదు. కానీ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తీరుపై జనసైనికులు మండిపడుతున్నారు.
తప్పు చేసిన పోలీసు అధికారిని.. రాజకీయ కారణాలతో వెనుకేసుకు వచ్చి వారిని మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నారని. .. అదే రాజకీయంతో ఎస్పీలు కూడా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ వివరణ అడగడం ఏమిటని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసిన తర్వాత సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకుంటున్నట్లుగా లీకులు ఇచ్చారు. కానీ అదేమీ లేదు.. కేవలం ఓ చార్జ్ మెమో ఇచ్చి సరి పెట్టారు.