వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. అనారోగ్య కారణాల వల్ల బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకు ముందే … మాగుంట రాఘవ తన అమ్మమ్మకు బాగో లేదని.. ఆమెను చూసుకోవాలని చెప్పి రెండు వారాల మధ్యంతర బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అయితే ఈడీ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ రద్దు చేసేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఫిబ్రవరిలో మాగుంట రాఘవను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లో ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు.. ఆయన బెయిల్ తెచ్చుకుని అప్రూవర్ అయ్యారు. మాగుంట కుటుంబం దశాబ్దాలుగా డిస్టిలరీల వ్యాపారంలో ఉన్నారు. అయితే వారిపై ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం మాగుంట రాఘవరెడ్డి జైలుకెళ్లాల్సి వచ్చింది. సౌత్ గ్రూపులో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి లంచాలిచ్చి లిక్కర్ బిజినెస్ సొంతం చేసుకున్నారని ఈడీ చెబుతోంది.
సమీర్ మహేంద్రు: అరుణ్పిళ్లైకి, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ్ మాగుంటకు చెందిన జైనాబ్ ట్రైడింగ్, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు చెల్లించారు. మాగుంట ఆగ్రోఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రాఘవ్‌కు కూడా రెండు రిటైల్ జోన్లు ఉన్నాయిని ఈడీ చార్జిషీట్లో ప్రకటించింది. అయితే అందరూ అరెస్టయ్యారు కానీ కవిత మాత్రం బయటే ఉన్నారు. మాగుంట రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి ఎంపీగా చూడాలనుకున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆయన మాత్రం…. రాజకీయ జీవితం ఆరంభం కాకుండానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అరెస్టయ్యారు. ఐదు నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది.