ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ సర్కార్ దివాలా తీయించిందని అనేక రకాల లెక్కలు బయట పెట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లేకుండా సమావేశాల్లో గడుపుతున్న ఆమె.. ఏపీ ఆర్థిక పరిస్థితి, అక్రమంగా చేస్తున్న అప్పుల వివరాలన్నింటినీ సమీకరించి.. బయట పెట్టారు. ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వ ఆర్థిక ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఎక్కడెక్కడ ఎలాంటి అప్పులు చేశారో.. గ్యారంటీ లేని అప్పులు.. రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి చేసిన అప్పుల గురించి చెప్పారు. వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
నిజానికి పురందేశ్వరి చెప్పినవన్నీ నిజాలే. ఇంకా బయటకు రావాల్సిన అప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలుసు. కానీ కేంద్రానికి తెలియదన్నట్లుగా తాము ఫిర్యాదు చేస్తామని పురందేశ్వరి చెబుతున్నారు. అసలు అప్పులకు సహకారం అందిస్తున్నదే కేంద్రం అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని అప్పులు చేస్తున్నా నిజాలు చెప్పడం లేదు. కాగ్ కు సైతం తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. నిజానిజాలేంటో చూడకుండా కాగ్ కూడా సర్టిఫై చేస్తోంది. ఇవన్నీ అందరికీ తెలిసినా.. కేంద్రానికి తెలియదని ఎలా అనుకుంటారన్న సందేహం సహజంగానే వస్తుంది.
అయితే పురందేశ్వరి మాత్రం కొత్తగా ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిన కొత్తగా నియమించడంతో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అనుకుంటారేమో కానీ.. ఫిర్యాదులపై స్పందించి ప్రభుత్వ నిర్వాకాలను వెలుగులోకి తెచ్చి కేంద్రమే ప్రజల ముందు పెడితే మాత్రం .. రాజకీయం మారిపోతుంది. కేంద్రం అలా చేస్తుందా లేదా అన్నదే డౌట్.