అమరావతి ప్రాంతంలో అధికార తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బినామీ పేర్లతో బారీగా భూములు కొన్నారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపాణలని తెదేపా నేతలు చాలా ధీటుగానే ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ ఆరోపణల కారణంగా తెదేపా ప్రభుత్వ ప్రతిష్ట చాలా మసకబారుతోంది. మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు వైకాపా ఆరోపణలను బలంగా త్రిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తుంటే, సరిగ్గా ఇటువంటి సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబు తన భార్య రాజధాని ప్రాంతంలో 83 సెంట్ల భూమి కొనుకొన్నారని చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైకాపా మాపై నిరాధారమయిన ఆరోపణలు చేస్తోంది. రాజధాని ప్రాంతంలో నా భార్య కేవలం 83 సెంట్ల భూమి మాత్రమే కొనుకొన్నారు. అంతకు మించి ఒక్క సెంటు భూమి అదనంగా ఉన్నట్లు చూపించినా నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్దంగా ఉన్నాను,” అని వైకాపాకి సవాలు విసిరారు.
వైకాపా ఆరోపణలు చేస్తున వారిలో తెదేపా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేరు కూడా ఉంది. ఆయన కూడా “నేను రాజధానిలో నివాసం ఉండాలనే ఉద్దేశ్యంతోనే కొంత భూమిని కొనుకొన్నాను తప్ప బినామీల పేరుతో బారీగా భూములు కోనలేదు. దీనిపై జగన్మోహన్ రెడ్డి చర్చకు తాను సిద్దమని జగన్ కూడా సిద్దమేనా?” అని సవాలు విసిరారు.
అధికార పార్టీకి చెందిన వాళ్ళు రాజధాని ప్రాంతంలో భూములు కొనుకోవడంపై నిషేధం ఏమీ లేదు కనుక ఎవరయినా అక్కడ కొనుకోవచ్చును. కానీ వందలు వేల ఎకరాలను బినామీ పేర్లతో కొంటున్నట్లు వైకాపా ఆరోపిస్తోంది. తాము ఎటువంటి అవినీతి, అక్రమాలకూ పాల్పడలేదని తెదేపా నేతలు అందరూ గట్టిగా వాదిస్తున్నారు. కానీ సమయం కానీ సమయంలో ఇద్దరు తెదేపా నేతలు రాజధాని ప్రాంతంలో తాము భూములు కొన్నామని చెప్పడం వైకాపా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది తప్ప వారి నిజాయితీని నిరూపించుకోవడానికి ఉపయోగపడదు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ స్వయంగా తాము భూములు కొన్నామని ఇటువంటి సమయంలో చెప్పుకోవడంతో ఇప్పుడు వైకాపా ఇంకా రెచ్చిపోవచ్చును. అధికార పార్టీ నేతలపై తాము చేస్తున్న ఆరోపణలు నిజమని వారే దృవీకరిస్తున్నారని, మున్ముందు ఇంకా చాలా మంది నేతల పేర్లు బయటకొస్తాయని వాదించి ప్రజలను ఆకట్టుకోవచ్చును.