సోషల్ మీడియాలో జనసైనికులకు, మెగా ఫ్యాన్స్ కు మధ్య వార్ జరుగుతోంది. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఈ చిచ్చుకు కారణం అయ్యారు. చివరికి ఈ విషయంలో గొడవలు వద్దని నాగబాబు కూడా కల్పించుకోవాల్సి వచ్చింది. జనసేనలో అధికార ప్రతినిధిగా రాయపాటి అరుణ అనే మహిళ ఉంటారు. ఆమె టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ఆమెకు నోటి మీద అదుపు ఉండదని జనసైనికులే మండి పడుతూ ఉంటారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు.
తాజాగా ఆమె ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ. జనసేనకు ఓట్లు రాకపోవడానికి చిరంజీవే కారణం అన్నారు . ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయారని.. ఈ కారణంగానే ఓట్లు వేయలేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా వివాదాస్పదం అయ్యాయి. ఆమెపై చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసైనికులు, చిరంజీవి ఫ్యాన్స్ వేర్వేరు కాదు. అయితే ఈ వివాదం ప్రారంభమయ్యేసరికి రెండువర్గాలుగా మారిపోయారు.
చిరంజీవిపై రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… చిరంజీవి , రామ్ చరణ్ ప్యాన్స్ .. సోషల్ మీడియా వ్యవహారాలను చూసే శివ చెర్రి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాయపాటి అరుణ క్షమాపణ చెప్పాలన్నారు. దీనిపై చిరంజీవి అభిమానులు కూడా స్పందించారు. వివాదం తీవ్రం అవుతూండటంతో నాగబాబు కూడా స్పందించారు. రాయపాటి అరుణ ఫ్లోలో మాట్లాడారని.. ఆమెను తప్పు పట్టవద్దని సోషల్ మీడియాలో జనసైనికులు, మెగా ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. అయితే మెగాస్టార్ ను కించ పరిచి.. ఫ్లోలో వచ్చిందని అంటే.. ముందు ముదు చాలా మంది అదే పని చేస్తారని… మెగాస్టార్ గౌరవాన్ని కాపాడాల్సి ఉందని కొంత మంది అంటున్నారు.