తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదారు రోజులుగా పూర్తిగా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎన్నికల వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారని అంటున్నారు. అధికారులు పిలుపుల్ని బట్టిఫామ్ హౌస్ కే వెళ్లి వస్తున్నారు. అధికారుల పోస్టింగులు ముఖ్యంగా పోలీసు అధికారుల పోస్టింగ్‌లను ఆయన దిగువ స్థాయి నుంచి చూసుకుని మార్పు, చేర్పులు చేస్తున్నారు. అందుకే దాదాపుగా ప్రతి రోజూ.. బదిలీల ఉత్తర్వులు వెలువడుతున్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అదే సమయంలో కేసీఆర్ రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టారు. ఇక బీజేపీని పరిగణనలోకి తీసుకోవద్దని.. కాంగ్రెస్ కన్నా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే ప్రతీ మాటను ఎలా వివాదం చేయాలన్నదానిపై ప్రత్యేకంగా ఓ టీముని నియమించారని అంటున్నారు. అందులో భాగంగానే.. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వెంటనే కొంత మంది తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. కాంగ్రెస్ సంగతి తేలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. బీసీ నేతలు కూడా ప్రత్యేకంగా సమావేశమై.. అసలు రేవంత్ ఏమన్నారో చెప్పకుండానే… బీసీల జోలికొస్తే తాట తీస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
రేవంత్ రెడ్డి దూకుడు బీఆర్ఎస్ ను కంగారు పెడుతోంది. ఆయనపై తాము చేసే పోరాటం.. కాంగ్రెస్ లో ఆయన స్థానాన్ని బలహీనం చేస్తే తాము బలపడినట్లేనన్న భావనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి ట్రాప్‌లో బీజేపీ పడింది. రేసులో లేకుండాపోయింది. ఇప్పుడు అదే వ్యూహం కాంగ్రెస్ పై ప్రయోగిస్తున్నారని అంటున్నారు.