వాలంటీర్లకు ఒకటో తేదీనే జీతం ఇస్తారు. ఆ తర్వాత మిగిలితే ప్రభుత్వ ఉద్యోగులకు సర్దుతారు. ఇలాగే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇక వాలంటీర్లకు అయితే…రెండు, మూడు నెలలకు ఓ సారి ఇస్తారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల వాలంటీర్ల వివాదం తర్వాత… వారు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతుగా రంగంలోకి రాలేదని అనుకున్న ప్రభుత్వ పెద్దలు వారికి గిలిగింతలు పెట్టడానికి ఏర్పాట్లు చేసింది. అదేమిటంటే.. ఒకటో తేదీనే జీతాలివ్వడం.
సీఎఫ్ఎంస్లో ముందుగా వాలంటీర్ల జీతాల బిల్లులే అప్ లోడ్ చేయాలని.. తర్వాతే ఉద్యోగుల బిల్లులు అప్ లోడ్ చేయాలని ఆదేశాలు చేశారు. వాలంటీర్లకు ఒకటో తేదీన జీతాలిచ్చిన తర్వాత పర్మినెంట్ ఉద్యోగులకు ఇతరులకు బదిలీ చేస్తారు. నెలాఖరుకు అందుబాటులో ఉన్న సొమ్ముతో సరిపడినంత మందికి జీతాలు వేస్తున్నారు. ముందు ఎవరికి.. తర్వాత ఎవరికి అనేది ప్రభుత్వ పెద్దల ప్రయారిటీ ప్రకారం వేస్తున్నారు. ముందుగా పోలీసులకు వేస్తారు. చివరికి టీచర్లకు వేస్తారు. ఇప్పటి వరకూ వాలంటీర్లకు ఉన్నప్పుడు ఇస్తున్నారు.
వాలంటీర్లకే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులు జారీచేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాలంటీర్లపై ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్న సమయంలో… వారు తమకు ఎదురయ్యే పరిస్థితులతో వెనక్కి తగ్గకూడదని ఎన్నికల సమయంలో మరింత జోరుగా పని చేయాలని కోరుకుంటున్నారు. అందుకే పాంపరింగ్ ప్రారంభించారని అంటున్నారు.