తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికలు పూర్తిగా రేవంత్ కనుసన్నల్లోనే జరుగుతాయని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి రేవంత్ రెడ్డిని చైర్మన్ గా ప్రకటించింది. మొత్తం ఇరవై ఆరు మంది సభ్యులు.. ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులతో కమిటీ ఏర్పాటయింది.
ఇటీవల అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వివాదాస్పదం చేసిన క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు పరోక్షంగా రేవంత్ రెడ్డిని తప్పు పట్టారు. ఆయన టీడీపీ నుంచివచ్చిన నేత అంటూ.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సింక్ అయ్యేలా కామెంట్లు చేయడం కలకలం రేపింది. అంతర్గతంగా రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని కొంత మంది హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న ప్రచారాన్ని ప్రత్యర్థి నేతలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డినే ఎన్నికల కమిటీకి చైర్మన్ గా చేయడంతో.. హైకమాండ్‌కు ఆయనపై ఏ మాత్రం నమ్మకం తగ్గలేదని నిరూపితమయిందని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మొత్తం ఎన్నికల బాధ్యతను ఈ కమిటీనే చూస్తుంది. ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీలో వివాదాలన్నింటికీ ఈ ఎన్నికల కమిటీతో చెక్ పెట్టినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. ఇక ఎవరూ రేవంత్ రెడ్డి మాటను జవదాటకూడదని.. ఆయన చెప్పే పార్టీ స్టాండ్ ప్రకారమే ముందుకు వెళ్లాలన్న సంకేతాల్ని పార్టీ హైకమాండ్ పంపిందని అంటున్నారు.