బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు బలమైన అగ్రనేతలు జంప్ అవుతూండటం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అయితే దీనికి కారణం మాత్రం కేసీఆరే. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు అవసరం లేకపోయినా ప్రోత్సహించిన ఫిరాయింపుల వల్ల నేడు బలమైన నేతల్ని వదులుకోవాల్సి వస్తోంది. పదవులు, నిధులకు ఆశపడి గెలిచి నపార్టీని వదిలి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది.
జూపల్లి, పొంగులేటి, తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి అందరూ బలమైన నేతలే. వారి స్థానాల్లో ఇతరుల్ని తీసుకుని వీరిని పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్ ఇవ్వబోమన్న సంకేతాలు ఇవ్వడంతో వీరంతా ఎవరి దారి వారు చూసుకుటున్నారు. గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏదో ఓ పదవి ఉంటుందని నేతలు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీలో చాన్స్ ఉంటుంది. రెండు పార్టీలూ నేతలకు వల వేస్తున్నాయి. ఆఫర్లతో రెడీగా ఉన్నాయి . అందుకే ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్ఎస్ నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకోాల్సిందే. ఎందుకంటే.. ఎన్నికల్లో పాల్గొనే స్టామినా ఉన్న నేతల్ని… నామినేటెడ్ పోస్టులతో కట్టడి చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే వికర్ష్ గా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీకి.