పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి దివాలా తీశారు. అలా ఇలా కాదు.. బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పులు తీసుకుని మరీ దివాలా తీశారు. డబ్బుల్లేవని..కట్టలేనని ఆస్తులు అమ్మేసుకోవచ్చని సలహా చ్చారు. రూ. 900 కోట్లకుపైగా అప్పలు చేసి ఆయన తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. యాభై కోట్లు కూడా ఉండదని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
పులివెందుల మూలాలున్న శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ రెడ్డికి సన్నిహితుడు. మొదట్లో ఏదో ఉద్యోగం చేసుకునే ఆయన తర్వాత కాంట్రాక్టుల్లోకి వచ్చారు. ఈ పేరుతో పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 2014లో హిందూపురం ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయారు. తర్వాత పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంట్రాక్టుల పేరుతో ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు కానీ పనులు చేశారో లేదో ఎవరికీ తెలియదు. ఆ రుణాలెటుపోయాయో కూడా తెలియదు. దారి మళ్లించేశారు. తర్వాత లోన్లు కట్టడం ఆపేశారు. బ్యాంకర్లు ఆస్తులు వేలం వేస్తామంటే వేసుకోమన్నారు కానీ.. కడతామని చెప్పడం లేదు. రూ.యాభై కోట్ల ఆస్తులు.. రూ. 900 కోట్ల అప్పులకు వేలం వేసుకుంటామంటే ఎందుకు సంతోషంగా ఒప్పుకోరు ?
మామూలుగా అయితే ఇలాంటి వారిపై సీబీఐ కేసులు నమోదు చేసి… రుణాలు ఎటు మళ్లించారో విచారణ చేసి జప్తు చేస్తారు. అరెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ నేత. సీఎం జగన్ రెడ్డి ఫ్రెండ్. అందుకే అంత దూకుడు చూపించలేకపోతున్నారు. విజయ్ మాల్యా భయపడి పారిపోయాడు.. శ్రీధర్ రెడ్డి మాత్రం వ్యవస్థల గురించి బాగా తెలుసుకుని ధైర్యంగా.. అవును డబ్బులు ఎగ్గొట్టా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ తిరుగుతున్నారని.. పుట్టపర్తి ప్రజలు సెటైర్లు వేసుకుంటున్నారు.