వైసీపీ ప్రభుత్వం వచ్చాక విజయ్ కుమార్ అనే ఐఏఎస్ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆ అతి అంతా ఎందుకంటే ఈ ప్రభుత్వ కాలంలోనే ఆయన రిటైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీటు పట్టేయాలనే. అందుకే ప్రభుత్వం ఏది చెబితే అది చేశారు. ఎంత విధేయత చూపించాలో అంతా చేశారు. అధికార వేదికల మీద జగన్ రెడ్డిని ఎంత పొగడాలో అంత పొగిడారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాంటి అధికారులకు ఏదో పదవి ఇచ్చినట్లుగా ఆయనకూ ఓ పదవి ఇచ్చారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు ఎన్నికల్లో పోటీ చేయడం.
ఇటీవల జిల్లాల్లో తిరిగి ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సమావేశం అవుతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఆ వర్గాల్లో వ్యక్తమవుతూండటంతో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ అసంతృప్తి చిన్నగా లేదని ఎక్కువే ఉందని..గుర్తించి పాదయాత్ర చేస్తానని జగన్ రెడ్డికి దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో కానీ.. ఆయన తీరు మాత్రం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఎంపీ టిక్కెట్ పై గురి పెట్టారు. అది బాపట్ల లేకపోతే తిరుపతి అన్నట్లుగా ఆయన తీరు ఉంది. పాదయాత్ర చేస్తే జగన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అనుకుంటున్నారు.
ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున వైసీపీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ప్రభుత్వం చెప్పినవన్నీ చేశామని.. ప్రభుత్వం మారితే్ తమను బతకనీయరని.. అందుకే రాజకీయాల్లోకి వస్తామని ఎక్కువ మంది కారణం చెబుతున్నారు. పీవీ సునీల్ కుమార్ ఇప్పటికే రెడీ అయ్యారు. ఇంకా జాబితాలో చాలా మంది ఉన్నారు. వారిలో విజయ్ కుమార్ ప్రయత్నాలు మాత్రం పాదయాత్ర దాకా వచ్చాయి. ముందు ముందు ఇలాంటి విధేయుల తాకిడి వైసీపీకి ఎక్కువగానే ఉండనుంది.