ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ . పేరు కాంతి రాణా టాటా. విజయవడా పోలీస్ కమిషనర్. రాజ్యాంగం.. చట్టాలపై సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. అలా ఉండకపోతే ఐపీఎస్ ఆఫీసర్‌గా అనర్హుడే్. అలాంటి ఆఫీసర్ ఓ పెద్ద కేసును చేధించినట్లుగా హడావుడి చేసి.. సీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి.. హంగామా చేసిన కేసులో.. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించడానికి తిరస్కరించింది. అదే మార్గదర్శి కేసు.
మార్గదర్శిలో చిట్ వేశానని.. పాడుకున్నా డబ్బులివ్వలేదని ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం ఆలస్యం..అదేదో అంతర్జాతీయ స్కాం అన్నట్లుగా దాడులు చేసి.. ఏజంట్లను.. మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఒక రోజంతా తమ దగ్గర ఉంచుకుని చివరి క్షణాల్లో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆయన పాడుకున్నారు కానీ ష్యూరిటీలు ఇవ్వలేదని..చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఇలాంటివి పరిష్కరించుకోవడానికి వేరే వేదికలు ఉన్నాయని చెప్పినా లెక్కలోకి తీసుకోలేదు. కావాలనే ఫిర్యాదు చేయించినట్లుగా పోలీసులు వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం.. చేసేశారు. ఇప్పుడు నిందితుడికి రిమాండ్ విధించడానికి న్యాయస్థానం తిరస్కరించింది.
కోర్టుకు రిమాండ్ కూడా ఇవ్వని ఓ కేసులో సీపీ కాంతిరాణా టాటా చేసిన అతి ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పోలీసు కమిషనర్ పోస్టుకు అర్హుడేనా అన్నచర్చ జరుగుతోంది. ఇక సామాన్యుల్లో జరిగే చర్చ సంగతి చెప్పాల్సిన పని లేదు. పోస్టింగ్‌ల కోసం.. ఇలాంటి నేరాలను పోలీసులు వ్యవస్థీకృతంగా చేస్తున్నారని..ఇక ప్రజలకు ఎలా భద్రత ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థ పని తీరు రాను రాను ఒక్క రాజకీయ పార్టీ కోసం పని చేయడానికే అన్నట్లుగా మారిపోతోంది. ఇలాంటి పోలీసు అధికారుల తీరు వల్ల.. వ్యవస్థపైనే ప్రజలు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతోంది.
పై స్థాయి అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా బాధితులు కాని వారిని బాధితులుగా చూపి.. ఏ తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు.. జైలుకు పంపాలనే కుట్రలు చేసిన ఏ అధికారికీ.. ఖాకీ చొక్కా వేసుకునే అర్హత ఉండదు. ముస్సోరిలో అదే నేర్పుతారు. కానీ ఫీల్డ్ లో వారేం చేస్తున్నారు ?