దమ్ముంటే గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ చేయాలని ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి కాకుండా మరో చోట ఎందుకు పోటీ చేస్తారని.. దానిపై రేవంత్ రెడ్డి సవాల్ చేయడం ఏమిటని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. అయితే రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఇన్ సైడ్ ఇన్ఫో ఉండబట్టే ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ సారి గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయబోవడం లేదన్న చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది.
ఆయన ఇప్పటికే అక్కడ రెండు సార్లు గెలిచారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సారి సీటు మారాలన్న ఉద్దేశంతోనే .. గతంలో చాలా కాలంగా టీడీపీలో పని చేసుకుని ప్రజల అభిమానాన్ని పొందిన ప్రతాపరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని.. కేసీఆర్ నియోజకవర్గం మారుతారని అంటున్నారు. ఆయన పోటీ చేయాలనుకుంటున్న నియోజకర్గాల్లో మునుగోడు.. కామారెడ్డి వంటివి ఉన్నాయని చర్చకు వస్తున్నాయి.
కామారెడ్డిలో కేసీఆర్ పోటీపై సర్వే సంస్థలు నివేదికలు సిద్ధం చేసిన విషయం తెలియడంతోనే.. రేవంత్ రెడ్డి అక్కడి నుంచే పోటీ చేయాలని సవాల్ చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేయడంతో… గజ్వేల్ నుంచి పోటీ చేయకపోతే.. ఓటమిని అంగీకరించినట్లే అవుతుందన్న ఉద్దేశంతో రెండు చోట్ల పోటీ చేయాలన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే టిక్కెట్ల కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు కేసీఆర్.