ఆంధ్రప్రదేశ్లో అరాచక వ్యవస్థలు ఎలా రాజ్యమేలుతున్నాయో ఓటర్ల సవరణ వ్యవహారం నిగ్గు తేల్చేస్తోంది. బీఎల్వో అంటే బూత్ లెవల్ ఆఫీసర్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉంటే…వారి వెంట ఓట్ల పరిశీలనకు.. వాలంటీర్లు వెళ్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యమని ప్రతిపక్ష పార్టీలుగగ్గోలు పెడితే నలుగురు బిఎల్వోలను సస్పెండ్ చేసి.. ఓకేనా అని అడుగుతున్నారు పాలకులు.
ఏపీలో ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో తారుమారు అయింది.ఇదెలా జరిగిందో విచారణ జరిపితే మొత్తం కుట్ర బయటపడుతుంది.కానీ.. మళ్లీ సవరిస్తామని చెప్పి రంగంలోకి దిగారు.కానీ ఎవరైతే ఓటర్ జాబితాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారినే రంగంలోకి దంపారు. ఇక అక్రమాలకు ఎలా తెరపడుతుంది. ఏ నియోజకవర్గంలో అయినా.. గెలుపోటముల్ని తేల్చేది ఐదు, పది వేల ఓట్లే. ఓ పార్టీకి చెందిన వారి ఓట్లు ఐదు వేలు తొలగిస్తే ఎదుటి పార్టీకి పది వేల ఓట్లు కలిసినట్లే. ఇంత కంటే ప్రజాస్వామ్య హత్య ఉండదు. కానీ అందరూ కలిసి అదే చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితమైన ఆధారాలతో చేస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తోంది. కానీ ఇక్కడ మళ్లీ తప్పు చేసిన వారికే నిజానిజాలు తేల్చే బాధ్యతలు ఇస్తోంది. గతంలో ఉరవకొండలో తప్పులు జరిగితే.. నేరుగా కేంద్ర అధికారులు వచ్చారు. అలా రాష్ట్రం మొత్తం కేంద్ర అధికారులతో తప్పొప్పులు సరి చేస్తేనే ప్రయోజనం . లేకపోతే ఇక ఎన్నికలు నిర్వహించడం కూడా దండేగేనన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల్లో వినిపిస్తోంది.