వైసీపీలో జగన్ రెడ్డి మాటల్ని లెక్క చేసే వారు క్రమంగా తగ్గిపోతున్నారు. తమను బలి పశువుల్ని చేసేందుకు వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిసిన తరవాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ .. క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు టిక్కెట్ ఇస్తే … తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. తాను కాకపోతే తన కుమారుడు అయినా పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
మంత్రి వేణు తో కలిసి కూర్చునే పరిస్థితి లేదని.. తన కేడర్ ను ఇబ్బంది పెడుతున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు. ఇటీవల ఎంపీ మిథన్ రెడ్డి గోదావరి జిల్లాల్లో మూడు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా వేణుకు టిక్కెట్ ప్రకటించేశారు. దీంతో సుభాష్ చంద్రబోస్ అసహనానికి గురయ్యారు. పార్టీ సమావేశాలకు వెళ్లలేదు. తర్వాత జగన్ రెడ్డి పిలిస్తే వెళ్లి మాట్లాడారు. అక్కడా జగన్ రెడ్డి.. హెచ్చరించి తిట్టి పంపారని చెబుతున్నారు.
ఈ క్రమంలో పిల్లి సుభాష్ తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడం సంచలనంగా మారింది. నిజానికి రామచంద్రాపురం సీటు ఆయనదే. గత ఎన్నికల్లో పీకే సర్వేలు చూపించి.. ఆయనను ఓడిపోయే సీటు అయిన మండపేటకు పంపారు. గెలిచే సీటును వేణుకు ఇచ్చారు. తర్వతా మంత్రిని చేసినట్లుగా చేసి.. మండలి రద్దు పేరుతో ఆ పదవినీ పీకేశారు. రాజ్యసభకు పంపి ఇక రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారు. ఫలితంగా ఆయనలో ఉన్న అసంతృప్తి అంతా బయటకు వస్తోంది.