రాష్ట్రాన్ని ఏం చేస్తే ప్రజలకు ఎందుకు వారికి పథకాల పేరుతో డబ్బులు జమ చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమన్నట్లుగా ఉన్న పాలకుల వ్యవహారాల తీరుపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పలు చేసినా లబ్దిదారులకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వలేకపోతున్నారు. అమ్మఒడి డబ్బులు ఇప్పటికీ సగం మందికిపైగా అందుకోలేకపోయారు. నాలుగు వారాలు దాటిపోయినా ఇంత వరకూ డబ్బులు రాకపోవడం… చాలా మందికి తొమ్మిదివేలు.. ఐదు వేలు జమ చేస్తూండటంతో.. ఆ డబ్బులపై ఆశలు పెట్టుకున్న వారు అసహనానికి గురవుతున్నారు.
బటన్లు నొక్కుతున్నా జమ కాని డబ్బులు !
ఇటీవలి కాలంలో సీఎం జగన్ రెడ్డి ఏ పథకం బటన్ నొక్కాలన్నా.. ఫుల్ పేజీ ప్రకటనలు. హెలిప్యాడ్లు, కోట్ల ఖర్చుతో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఘనంగా బటన్ నొక్కుతున్నారు. ఆయన బటన్ ఎందుకు నొక్కుతున్నారో ఎవరికీ తెలియదు. ఆ బటన్ నొక్కగానే అకౌంట్లో డబ్బులు పడతాయని అందరూ అనుకుంటారు. కానీ పడవు. అసలు సీఎం జగన్ రెడ్డి నొక్కే బటన్‌కు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడటానికి సంబంధమే లేదు. మరి ఎందుకు బటన్ నొక్కుతున్నారో ఆయనకే తెలియాలి. పోనీ ఇలా నొక్కగానే అలా అకౌంట్లలో డబ్బులు పడితే… నిజమే కాబోలు ఆయన బటన్ నొక్కారని పడ్డాయని అనుకునేవారు. కానీ అదేమీ జరగడం లేదు.
ఆ బటన్ నొక్కే సీన్ కోసం రూ. కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు ?
బటన్ నొక్కగానే పడాల్సిన డబ్బులు అకౌంట్లలో పడటం లేదు. దీనికి కారణం ఖజానాలో డబ్బులు ఉండటం లేదు. అయినా క్యాలెండర్ ప్రకారం నొక్కుతున్నామని చెప్పడానికే నొక్కుళ్ల సభలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ రేపు అని ఎదురు చూసే లబ్దిదారులకు… ఎదురు చూపులే మిగులుతున్నాయి. పంట నష్టపరిహారం బటన్ నొక్కిన చాలాకాలం వరకూ డబ్బులు పడలేదు. ఇప్పటికీ కొంత మందికి అందలేదు. అమ్మఒడి అంతే. ఇక నేతన్న హస్తం బటన్లు నొక్కారు కానీ.. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.
ఆదాయం, అప్పులు అన్నీ ఎక్కడికిపోతున్నాయి ?
కొత్త ఆర్తిక సంవత్సరంలో వచ్చిన అప్పుల అనుమతుల్ని మూడు నెలల్లో నాకించేశారు. విచ్చలవిడిగా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టేశారు. కేంద్రం… రూ. పది వేలకోట్లకుపైగా లోటు భర్తీ నిధులిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత ఆదాయం వచ్చింది. అప్పులూ చేశారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి..? అన్నీ పెద్దలకే తెలియాలి. ఎందుకంటే… అప్పులు… ఖర్చులను సొంత ఆదాయంలా నిర్వహిస్తున్నారు. ప్రజల్ని ఓ మాదిరిగా కూడా లెక్కలోకి తీసుకోవడంలేదు.