తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా విదేశీ పర్యటనకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆయనను మణిపూర్ వెంటాడుతోంది. కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల మంత్రి కూడా. మణిపూర్ తగలబడుతోంటే.. అక్కడ మహిళలపై దారుణాలు జరుగుతూంటే కిషన్ రెడ్డి … ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా కనీసం పట్టించుకోలేదని … జాతీ.య మీడియా కూడా దుమ్మెత్తి పోస్తోంది. ఆయన మాత్రం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఏ కర్యక్రమంలో పాల్గొన్న మీడియా ఆయన దగ్గరకు వెళ్లి మణిపూర్ గురించే ప్రస్తావిస్తోంది. దీంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. ఓ తెలుగు మీడియా ఇలా ప్రశ్నించేసరికి ఆయన మణిపూర్‌తో నాకేం సంబంధం అనేశారు. అదేంటి మీరు ఈశాన్య రాష్ట్రాల మంత్రి కాదా అని మీడియా అడిగితే సమాధానం చెప్పకుండాపోయారు. బహుశా ఆయన దగ్గర రాజీనామా పత్రం తీసుకుని ఉంటారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఒక వేళ అలా తీసుకుని ఉంటే అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆయన కూడా ఒత్తిడికి గురవ్వాల్సి వస్తోంది.
ఓ వైపు తెలంగాణ బీజేపీలో పరిస్థితుల్ని చక్క బెట్టుకోవడం ఆయనకు తలకు మించిన భారంగా మారుతోంది. ఎన్నికలకు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి అవసరం ఏర్పడింది. బండి సంజయ్ ఉన్న సమయంలో యాక్టివ్ గా పని చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అందర్నీ మోటివేట్ చేసుకోవడానికి కిషన్ రెడ్డికి తీరిక ఉండటం లేదు. దీంతో ఆయనకు అసహనం తప్ప ఏమీ ఉండటం లేదని బీజేపీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి.