వైసీపీలో క్రమశిక్షణ కట్టుదాటిపోతోంది. ఒకప్పుడు జగన్ రెడ్డి ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు. కానీ ఇప్పుడు ఆయన పిలిస్తే.. టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని మొహం మీదనే చెప్పేసి వస్తున్నారు.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అదే చెబుతున్నారు. ఒక్క సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాదు… ఇటీవలి కాలంలో వైసీపీ నేతంతా అదే భావనలో ఉన్నారు. పార్టీ తమను ఉపయోగించుకుని.. తొక్కేస్తోందని తెలిసిన తర్వాత సజ్జల రెడ్డి అయితే ఏంటి… జగన్ రెడ్డి అయితే ఏంటి అనుకుంటున్నారు.
ఇతర పార్టీల్లో తమకు చోటు ఉంటుందని అంచనాకు వచ్చిన చోట్లవైసీపీ నేతలను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా నెల్లూరు లో నేతలంతా అదే పని చేయడం దీనికి నిదర్శనం. చివరికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా దండం పెట్టి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు రామచంద్రాపురం నుంచి పిల్లి బోస్ కూడా అదే చేస్తున్నారు. రామచంద్రాపురంలో టీడీపీ నేత త్రిమూర్తులు పార్టీ మారిపోయి … వైసీపీ తరపున మండపేటలో పని చేసుకుంటున్నారు. దీంతో టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. జనం నాడి తెలుసు కాబట్టి పిల్లి సుభాష్ .. కొడుకును టీడీపీ నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఒక వేళ రాజీ పడిపోతే.. కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం పోతుంది.. క్యాడర్ కూడాజారిపోతుంది. అందుకే జగన్ రెడ్డినీ లెక్క చేయడం లేదు.
నిజానికి ఇప్పుడు ఇలా వైసీపీలో ధిక్కారం వినిపిస్తున్న వారంతా జగన్ రెడ్డి వీర విధేయులు.. పార్టీని నమ్ముకున్న వారు. జగన్ రెడ్డితో పాటు మొదటి నుంచి నడుస్తున్న వారే. వారిని జగన్ రెడ్డి నిర్వీర్యం చేయాలనుకుంటూండటంతో వారంతా ధిక్కరిస్తున్నారు. దండం పెట్టేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత పిల్లిబోస్ ను పార్టీలో ఉంచుకునే అవకాశం లేదు. అలాగని… రఘురామరాజులా హింసించలేరు. మధ్యేమార్గంగా బోస్ రాజ్యసభ సభ్యుడిగా రాజీనామాకు సిద్ధపడినట్లుగా చెబుతున్నారు.