అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన జగన్ రెడ్డి పదే పదే అమరావతి రాజధానిగా చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు అమరావతి అందరి రాజధాని అయిందని గొప్పగా చెప్పారు. ఇప్పటి వరకూ అసలు అమరావతి అనే మాటను కూడా ఉచ్చరించడానికి జగన్ రెడ్డి ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేసి.. అడ్డగోలు ఉత్తర్వులు.. కోర్టుల్ని మభ్యపెట్టి.. హక్కులు లేని పట్టాలు పంపిణీ చేసి… రాజధాని అమరావతి అంటున్నారు. ప్రజా రాజధాని అయిందని.. సామాజిక రాజధాని అయిందని.. పేదలు రాజధానిలో నివసిస్తున్నారని అంటున్నారు.
జగన్ రెడ్డి అక్కడ ఇళ్లు కట్టిస్తారో లేదో అన్నది తర్వాతి సంగతి కానీ రాజధాని అమరావతి అని ఎందుకు పదే పదే చెబుతున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మూడు రాజధానులనేవి లేవని కేవలం విశాఖ మాత్రమే రాజధాని అని ఇటీవలి కాలంలో ప్రచారం చేస్తున్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కర్నూలు న్యాయరాజధాని చేయడం లేదని చెప్పారు. అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్ అని చెప్పడానికి కూడా చాన్స్ లేదు. మరి ఇప్పుడు అమరావతి రాజధానిగా ఎలా చెబుతున్నారు.
ఎక్కడో పట్టణాల్లో ఉండే పేదల్ని తీసుకొచ్చి.. ఏ మాత్రం అభివృద్ధి చెందని రైతులు ఇచ్చిన పొలాల్లో సెంట్ స్థలం ఇస్తే..అక్కడ ప్రజలు ఉండే అవకాశం లేదు. ఉపాధి కల్పించాలి. అలాంటి అవకాశం ఉందా అనేది ముఖ్యం. జగన్ రెడ్డి వచ్చాక.. అక్కడ ఉపాధి అనే మాటే లేదు. మరి అక్కడ జనం ఎలా ఉంటారన్నది ప్రశ్న. మొత్తంగా రాజధాని అమరావతి అని మభ్య పెట్టేందుకు మళ్లీ నాటకాలు ప్రారంభించారని .. ఎక్కువ మంది భావిస్తున్నారు.