నారా రోహిత్ మంచి అభిరుచి గల నటుడు. తన కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన పాత్రలు చేశారు. ఇందులో కొన్ని రిస్కీ ప్రయోగాలు కూడా వున్నాయి. తన అభిరుచి తగ్గ సినిమాలు చేయడానికి నిర్మాతగా కూడా మారారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్న రోహిత్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘ప్రతినిధి 2’ తన కమ్ బ్యాక్ మూవీగా అనౌన్స్ చేశారు.
బేసిగ్గా కమ్ బ్యాక్ మూవీ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రోహిత్ మాత్రం మళ్ళీ రిస్క్ తీసుకోవడానికే మొగ్గు చూపారు. ఈ చిత్రానికి ప్రస్తుతం టీవీ5 లో పని చేస్తున్న సినియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకి ఇదే మొదటి సినిమా. ప్రతినిధి 2 మీడియా రాజకీయాలు సామజిక అంశాలు టచ్ వున్న సబ్జెక్ట్. కథ పరంగా మూర్తికి లోతైన అవగాహన ఉండొచ్చు. ఐతే దర్శకత్వం కూడా ఆయనతోనే చేయించడం గమనార్హం.
సినిమాల్లోకి వచ్చేసరికి కథ, దర్శకత్వం దేనికవే ప్రత్యేకం. మంచి కథ వుండి మేకింగ్ లో పట్టులేకపోవడంతో తేలిపోయిన సినిమాలు చాలానే వుంటాయి. ఐతే ఈమధ్య కాలంలో కథ ఎవరిదో వాళ్ళకే దర్శకత్వం ఇచ్చే ట్రెండ్ నడుస్తోంది. ఐతే ఇది సినిమాల్లో పని చేసిన వారికి చెల్లుతుంది. సహాయ దర్శకుడిగా కనీసం ఒక సినిమాకి చేసిన అనుభవం, లేదా ఏదైనా పేరుమోసిన ఫారిన్ ఫిల్మ్ స్కూల్స్ లో చదివిన వారికే ఛాన్స్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు హీరోలు. కానీ రోహిత్ మాత్రం మూర్తిని నేరుగా న్యూస్ డిబేట్ ఫ్యానల్ నుంచి కెప్టెన్ చైర్ లో కూర్చోబెట్టేశారనే చెప్పాలి. ఏదేమైన కెరీర్ బినింగ్ నుంచి రిస్క్ లు చేస్తున్న రోహిత్ రీఎంట్రీని కూడా ఇలా ప్రయోగాత్మకంగానే మొదలుపెట్టడం విశేషం.