తెలంగాణకు ఎన్నికలకు ముందు కొత్త డీజీపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్ అధికారి. కానీ తెలంగాణలో కొనసాగుతున్నారు. దీనిపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. తాజాగా ఈ అంశంపై హైకోర్టుకు కేంద్రం ఓ అఫిడవిట్ సమర్పించింది. దాని ప్రకారం… అంజనీకుమార్ ఏపీకి పోవాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన హైకోర్టు తీర్పు అంజనీకు మార్ కూ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర పక్షాల వాదనలు వినడానికి.. హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కానీ పరిస్థితి చూస్తూంటే… పరిస్థితి ఈసీ చేతుల్లోకి వెళ్లిన తర్వాత తెలంగాణకు కొత్త డీజీపీ వస్తారన్న సందేహం మాత్రం బీఆర్ఎస్లో ప్రారంభమయింది
ఇటీవల బండి సంజయ్ ను అరెస్ట్ తర్వాత విచారణ పెండింగ్‌లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల క్యాడర్ వివాదంపై పిటిషన్ ను త్వరగా పరిష్కరించాలని కేంద్రం హైకోర్టును కోరింది. దీంతో మళ్లీ విచారణ ప్రారంభమయింది. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 12 మంది అధికారులు ఏపీ క్యాడర్‌కు చెందిన వారు. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. 0సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది.
డీజీపీని మార్చాలని బీజేపీ గట్టిగా అనుకుంటే… వారిని ఏపీకి పంపడం ఖాయమే.. అందుకే ఇప్పటికే కొంత మంది బీజేపీతో సాఫ్ట్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ పరమైన విషయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తే ఏమైనా జరగవచ్చన్న ఆందోళన వారిలో ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ కోరుకుంటుందన్న అభిప్రాయం ఉంది.