అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించినట్లుగా తేలడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 2018 నుంచి ఆయన అనర్హుడని స్పష్టం చేసింది. అంతే కాదు ఐదు లక్షలరూపాయల జరిమాా కూడా విధించింది. రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావున విజేతగా ప్రకటించింది. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ఉన్న సమయంలో హైకోర్టు తీర్పు రావడంతో వనమా మాజీ అయ్యారు.. జలగం ఎమ్మెల్యే అవుతున్నారు.
వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆయనపై బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు పోటీ చేశారు. జలగం ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పు చెప్పింది. గతంలోనూ ఇలా ఏపీలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు.. రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. అప్పట్లో ఆయన ప్రమాణస్వీకారం చేసి కొన్నాళ్లు ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. ఇప్పుడు ఈ పరిస్థితి వనమా వెంకటేశ్వరరావుకు వచ్చింది.
నిజానికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినట్లుగా ఆధారాలతో సహా అనేక మంది ఫిర్యాదులు చేస్తూంటారు. అయితే చాలా కొద్ది కేసులో విచారణ పూర్తయి.. తీర్పులు వస్తున్నాయి. తప్పుడు అఫిడవిట్ అని తేలిన వారిపై అనర్హతా వేటు పడుతోంది. మిగిలిన వారికి పదవి కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత తీర్పు ఎలా వచ్చినా వారికి పోయేదేమీ ఉండదు. వాస్తవంగా ఎన్నికల చట్టాల ప్రకారం.. రెండో స్థానంలో ఉన్నవారిని విజేతగా ప్రకటించడం కుదరదు. ఎవరిపైనైనా అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నిక నిర్వహించాలి. కానీ హైకోర్టు అసాధారణంగా తీర్పులు ఇవ్వడంతో రెండో స్థానంలో ఉన్న వారు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.