బీజేపీకి దగ్గర కాదు.. కాంగ్రెస్ కు చాలా దూరం అని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ అవిశ్వాస నోటీసు ఇచ్చాయి. వాటితో బీఆర్ఎస్ కలవలేదు. కానీ తాము బీజేపీ పక్షం కాదని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకే విడిగా అవిశ్వాస నోటీసు ఇచ్చింది. వ్యూహాత్మకంగా అందులో ఐదుగురు ఎంపీలతోనే సంతకం చేయించారు. ఎందుకంటే.. స్పీకర్ పరిగణనలోకి తీసుకోరు కాబట్టి. అనుకున్నట్లుగా వారి అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పీకర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం కూడా మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంతకం కూడా చేశారు. కాంగ్రెస్ తీర్మానంతో తమకు సంబందం లేదని బయటకు వచ్చి ప్రకటించారు. ల తాము విడిగా అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టామని చెబుతున్నారు. కచ్చితంగా ఈ నోటీసుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు తెరవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిస్తే బీజేపీకి కోపం వస్తుంది. సైలెంట్ గా ఉంటే.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం జరుగుతుంది. అందుకే.. చెల్లనిదైనా ఓ అవిశ్వాస నోటీసు ఇచ్చి కాస్త ప్రచారం చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించానుకుంది. అన్ని పార్టీలతో కలిసి పోరాడాలనుకుంది. చాలా పార్టీలను సంప్రదించారు కూడా. కానీ చివరికి.. ఒంటరిగా మిగిలిపోయింది. తాము కాంగ్రెస్ కు దగ్గర కాదని బీజేపీకి… బీజేపీకి దగ్గర కాదని ప్రజలను నమ్మించడానికి తంటాలు పడుతోంది.