ఈమధ్య చిన్న సినిమాలు కూడా ప్రీమియర్లతో హడావుడి చేస్తున్నాయి. విడుదలకు వారం ముందు నుంచే పెయిడ్ ప్రీమియర్లతో ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద సినిమాలకు ఆ అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్స్ షోలతో బజ్ క్రియేట్ చేసుకోవొచ్చు. ప్రీమియర్ల ద్వారా కలక్షన్లు కూడా పెంచుకోవొచ్చు. అయితే… శుక్రవారం విడుదల అవుతున్న `బ్రో`కి ఇలాంటి హడావుడి లేదు. నార్మల్ టైమింగ్స్ లోనే సినిమాని విడుదల చేస్తున్నారు. తెలంగాణలో 5 ఆటలకు పర్మిషన్ ఉంది. ఉదయం 8 గంటల షోతోనే `బ్రో` హంగామా మొదలు అవుతోంది. ఇది వరకు స్టార్ హీరోల సినిమా అంటే కనీసం తెల్లవారు ఝామున 4 గంటలకు బెనిఫిట్ షో పేరుతో ప్రత్యేక ఆటలు ప్రదర్శిస్తుంటారు. కానీ.. `బ్రో` అందుకు కూడా మొగ్గు చూపడం లేదు. హైదరాబాద్ లో కూడా తొలి షో పడేది 8 గంటలకే.
దీనికీ ఓ కారణం ఉంది. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో అయితే నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. ఫ్యాన్స్ షోలు వేసినా.. ఇప్పుడు వర్కవుట్ కాని పొజీషన్. మామూలు షోలకైనా జనాలు వస్తారా, రారా? అనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటప్పుడు బెనిఫిట్ షోలతో రిస్క్ తీసుకోవడం ఎందుకు? బుక్ మై షోల ద్వారా టికెట్ బుకింగ్స్ ఎప్పుడో మొదలైపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్న వాళ్లు ఎంత వర్షం పడినా ఎలాగూ థియేటర్లకు వస్తారన్నది నిర్మాతల ధీమా. అందుకే బెనిఫిట్ షోల వైపు దృష్టి సారించలేదు. ఓ పెద్ద హీరో సినిమా ప్రీమియర్ షోలు లేకుండా రావడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.