ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబుల్ని తాకట్టు పెట్టి మరోసారి పన్నెండు వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మరో వైపు ఇలాంటి అప్పులు రాజ్యాంగ వ్యతిరేకమని గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఏపీ రాజ్యాంగ వ్యతిరేక అప్పులపై ఫిర్యాదు చేసేందుకు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఏపీ వ్యవహారా ఇంచార్జ్ మురళీధరన్ తో సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ప్రభుత్వానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.
పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వ అప్పులు, కేంద్ర నిధుల మళ్లింపుపై ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పుడు జోనల్ సమావేశాల హడావుడిలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ వెళ్లి నిర్మలా సీతారామన్ ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఢిల్లీలో విజయసాయిరెడ్డి బీజేపీ అడిగినా అడగకపోయినా మా మద్దతు బీజేపీకేనంటూ… జాతీయ మీడియాకు పిలిచి మరీ చెబుతున్నారు.
ఏపీలో రాజకీయ పరంగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలో.బీజేపీకి అర్థం కావడం లేదు. పూర్తి స్థాయిలో సహకరిస్తున్న వైసీపీ అడ్డగోలు వ్యవహారాలను కూడా సమర్థించడమా లేకపోతే.. నిబంధనల ప్రకారం వెళ్లడమా అన్నదానిపై తేల్చుకోలేకపోతోంది. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి రూ. పన్నెండు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం సమీకరిస్తే అది ఖచ్చితంగా కేంద్రం సహకారంతోనే అవుతుంది. అప్పుడు పురందేశ్వరి ఫిర్యాదులకూ విలువ లేకుండా పోయినట్లవుతుంది.