ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అందరూ అప్రూవర్లుగా మారిపోతున్నార. ఇప్పటికే ఐదారుగురు అప్రూవర్లుగా మారిపోయారు. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి కుమారుడు రాఘవ కూడా అప్రూవర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు.
ఇటీవలే అనారోగ్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు . గతంలో ఆయనకు ఇలా అనారోగ్య కారణాలతో వచ్చిన బెయిల్ ను ఈడీ సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ రద్దు చేయించింది. కానీ మొన్న బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈడీ కనీసం అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. అప్పుడూ ఈడీ అభ్యంతరం చెప్పకపోతే బెయిల్ వస్తుంది.
అప్రూవర్ అయితే..క్షమాభిక్ష కూడా ఇచ్చేస్తారు. ఇప్పటికే అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యారు. నిందితులు అందరూ ముఖ్యంగా సౌత్ లాబీతో సంబంధం ఉన్నవాళ్లంతా అప్రూవర్ అవుతున్నారు. మరి అసలు ఎవరికి శిక్షపడుతుందో.. ఈ కేసును రాజకీయంగా అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లుగా ఎవరికైనా అనిపిస్తే దానికి దర్యాప్తు సంస్థలే కారణం.