ఓ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఏం చేస్తాడు ?.
ఈ ప్రశ్న ఇప్పటి తరానికి వేస్తే ప్రధానంగా వచ్చే ఆన్సర్ .. సంపాదించుకుంటాడని చెబుతారు. ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ సంపాదించుకుంటాడు. ఇసుక , మైనింగ్, చివరికి ట్రాన్స్ ఫర్ల దగ్గరా డబ్బులు సంపాదించుకుంటారు. అదే సత్తెనపల్లి లాంటి నియోజకవర్గాల్లో అయితే ఇంట్లో మనిషి చచ్చిపోతే వచ్చి ఆర్థిక సాయంలోనూ వాటాలు పొందుతారని చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులంటే వాళ్ల పని అదే. ప్రభుత్వం తమయిదే ఇక తిరుగులేనట్లే. నిజానికి వాళ్లు చేయాల్సిన పని.. అధికారం ఒకటే. అదే చట్టాలు చేయడం.
చట్టసభ సభ్యులు అనే వాళ్ల ప్రాథమిక విధి…చట్టసభల్లో చర్చల్లో పాల్గొనడం. తప్పు ఒప్పులు విశ్లేషించడం. చట్టాలు రూపొందించడంలో భాగం కావడం. అదే ప్రధాన విధి. అందుకే చట్టసభలు ఉన్నాయి. చట్టసభ సభ్యులు ఉన్నారు. ప్రజాసేవ అనేది అందరూ కల్పించుకున్నది. తమకు లేనిపోని అధికారాలు దఖలు పర్చుకుని. ప్రజాప్రతినిది అయితే.. ఆ ప్రజలందర్నీ దోచుకోవడానికి తమకు లభించిన లైసెన్స్‌గా చెలరేగిపోతున్నారు. చివరికి తమ ప్రాథమిక విధి అయిన పార్లమెంట్లో చర్చల్లో పాల్గొనడం అనేదాన్ని పూర్తిగా మార్చిపోతున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో కానీ.. అసెంబ్లీల్లో కానీ.. చివరికి మున్సిపాలిటీ, పంచాయతీల్లో కానీ చర్చలు జరుగుతున్న సందర్భమే లేదు. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసలు ఆత్మ లేకుండానే ప్రజాస్వామ్యం గమనం సాగిస్తోందన్నమాట
పార్లమెంట్లో చర్చ లేకుండా రైతు చట్టాల ఆమోదం- తర్వాత జరిగిందేందో గుర్తించరా ?
దేశంలో రైతు చట్టాలపై జరిగిన పోరాటం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ చట్టాలను కేంద్రం చివరికి వెనక్కి తీసుకుంది. అసలు ఇవి చట్టాలుగా మారాయన్న సంగతే చాలా మందికి తెలియదు. ఎందుకంటే పార్లమెంట్ ప్రతిష్ఠంభన కారణం చూపి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండానే ఈ బిల్లు ఆమోదించింది. పార్లమెంట్ సభ్యులు చర్చించకపోయినా చివరికి రైతులు ఈ బిల్లు గురించి తెలుసుకుని చర్చించుకుని రద్దు కోసం పోరుబాట పట్టాల్సి వచ్చింది. అంటే.. పార్లమెంట్ సభ్యులు చేయాల్సిన పని చేయలేదు. ప్రజలు చేయాల్సి వచ్చింది.. ఇలాంటి పరిస్థితి రాను రాను పెరిగిపోతోంది. చివరి సారిగా పార్లమెంట్ వాయిదా పడకుండా చర్చలు జరిగిన సందర్భంగా గుర్తు ఉందా ? ఎప్పుడో నాలుగేళ్ల కిందట… ఆర్టికల్ 370 మీద చర్చ జరిగింది. తర్వాత ఏ సందర్భంలోనూ పార్లమెంట్ సజావుగా జరిగిన సందర్భం లేదు. చర్చలు జరిగే అవకాశం రాలేదు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను చూస్తే.. సజావుగా సాగుతాయని ఎవరూ అనుకోవడం లేదు. ఒకే అంశంపై విపక్షం పట్టుబడుతోంది… ఆ ఒక్కటి కూడదని కేంద్రం అంటోంది. ఇద్దరూ పంతాలకు పోతున్నారు కానీ.. ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేస్తున్నామని అనుకోవడం లేదు. అక్కడే అసలు సమస్య వస్తుంది. ఎవరు తగ్గినా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగుతాయి. కానీ తగ్గడం అనే పదం వస్తే రాజకీయంగా నష్టపోతామని ఇరు వర్గాలు అనుకుంటున్నాయి. ఫలితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రస్తుతం మణిపూర్ అంశం.. కానీ ప్రతి సమావేశం సందర్భంగా ఇలాంటి అంశం ఓ సారి తెరపైకి వస్తుంది. ఓ సారి రాఫెల్.. మరోసారి అదానీ.. ఇంకో సారి ఇంకోకటి.. తెరపైకి వస్తాయి. ప్రతిపక్షం పట్టుబడుతుంది.. అధికార పక్షం బెట్టు చేస్తుంది. ఫలితంగా సమావేశాలు చర్చలు లేకుండా అలా అలా సాగిపోతూంటాయి.
పార్లమెంటరీ చర్చలను ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేస్తున్న రాజకీయం
17వ లోక్‌సభ 1952 తర్వాత అతి తక్కువ రోజులు సమావేశం అయిన చట్టసభగా చరిత్ర పుటల్లో రికార్డుల్లో నిలిచిపోనుంది. పూర్తి స్థాయి మెజార్టీ ఏకైక పార్టీకి ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి పార్లమెంట్ సమావేశాల్ని నామమాత్రం చేయాలనుకోవడం ఖచ్చితంగా ప్రజాస్వమ్యా ద్రోహమే అవుతుంది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్న ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ కేవలం 230 రోజులే సభ సమావేశమైంది. అంటే ఏడాదికి 58 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశమవుతోంది. ఇది సమావేశం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అంటే.. చర్చలు జరిగనట్లుగా కాదు.. ప్రభుత్వం సమావేశాలు జరిపిన రోజులు. వీటిలో అత్యధిక రోజులు.. వాయిదాలతోనే సమయం గడిచిపోయింది. లోక్‌సభ 34 శాతం, రాజ్యసభ 24 శాతం మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయి. చివరికి బడ్జెట్ కూడా చర్చ లేకుండా ఆమోదించాలంటే.. పార్లమెంట్ ప్రాధాన్యాన్ని ఏ దశకు తగ్గించేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయిదు మంత్రిత్వ శాఖలకు సంబంధించి రూ.11 లక్షల కోట్ల వ్యయం, వివిధ మంత్రిత్వ శాఖల రూ.42 లక్షల కోట్ల వ్యయం ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందాయి. రెండో విడత బడ్జెట్ సెషన్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 2022 శీతాకాల సమావేశాలు కూడా ఉభయ సభలు షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు వర్షాకాల సమావేశాల్లో ఒకేసారి 24 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి నాలుగురోజుల ముందే వాయిదా వేశారు. మొదటి రెండు వారాలు ఉభయ సభల్లో ఏ చర్చా జరగలేదు. మోదీ హయాంలో 16వ లోక్‌సభలో కేవలం 25 శాతం బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదిస్తే, ప్రస్తుత 17వ లోక్‌సభలో 15 శాతం బిల్లులను కూడా నివేదించలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ లోక్‌సభలో ఇంతవరకు కేవలం 14 బిల్లులను మాత్రమే కమిటీలకు పంపారు. అంతకు ముందు 60 నుంచి 70 శాతానికి పైగా బిల్లులను పార్లమెంట్లో స్థాయీ సంఘాలే చర్చించి సభ ఆమోదానికి పంపేవి. స్థాయీ సంఘాలకు విలువ లేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలుగుతాయో, ప్రభుత్వ నిధులు పూర్తిగా ఖర్చవుతున్నాయో లేదో సమీక్షించే అవకాశం కూడా లేకపోయింది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును చర్చించే సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు. అందుకే పార్లమెంట్ ఆమోదించిన బిల్లులపైనా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజల తిరుగుబాటే. కానీ పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారు ?
వృధా అయ్యే ఖర్చు అంతా ప్రజలదే !
ఒక్క నిమిషం అసెంబ్లీ లేదా లోక్ సభ సమావేశం అవడానికి లక్షల్లో ఖర్చవుతుందనే లెక్కలు తరచూ మీడియాలో వస్తూంటాయి. ఒక్క నిమిషానికే లక్షలంటే.. ఇక రోజుకు ఎంత.. సమావేశాల మొత్తానికి ఎంత అవుతుందో అంచనా వేయడం కష్టమే. వందల కోట్లు ఉంటుంది. సమావేశాలు జరిగినా జరగకపోయినా ఈ ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు సంగతి పక్కన పెట్టినా పార్లమెంట్ సభ్యుల ప్రధాన విధి. బిల్లులపై చర్చించడం.. కానీ ఆ పని మాత్రం సభ్యులు చేయడం లేదు. ఇప్పుడు మణిపూర్ అంశంపై ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆ ఒక్కటి అడగవద్దని కేంద్రం అంటోంది. కానీ అదే అడుగుతామని.. సభను జరగనీయబోమని విపక్షాల అదే పని చేస్తున్నాయి. మోదీ పార్లమెంటుకు వచ్చి సమాధానం చెబితే సమస్య పరిష్కారం అవుతుంది కదా ఎందుకు ఆలోచిస్తున్నారనేది ప్రజలకు వచ్చే సందేహం. గత కొన్నేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు గందరగోళం మధ్యే ముగుస్తున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా – పార్లమెంట్‌ను తమకు ఇష్టం వచ్చిన రీతిలో నడిపించడం, విపక్షాల విమర్శలను పట్టించుకోకపోవడం జరుగుతూ వస్తోంది. ఇది పార్లమెంట్ వరకే పరిమితం కావడం లేదు. రాష్ట్రాల అసెంబ్లీలు, నగర పాలక సంస్థలు.. చివరికి పంచాయతీ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి శాపంగా మారింది.
అధికార, విపక్షాలది రాజకీయ అజెండానే !
పార్లమెంట్ సక్రమంగా జరిగి, ప్రజాసమస్యలపై చర్చించాల్సిన బాధ్యత అధికార, విపక్షాల మీద ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో అలాంటి ప్రయత్నమేదీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినట్లు కనిపించలేదు. సమావేశాలు జరగకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలు భిన్నమైన వ్యూహాలను అవలంభిస్తూంటాయి. ఒక్కో సారి బీజేపీతో సన్నిహితంగా ఉండే పార్టీలు తమ సొంత రాష్ట్రాల సమస్యలను చర్చించాలంటూ సభకు పదేపదే అంతరాయం కలిగిస్తారు.. సభను వాయిదా పడేలా చేస్తారు. సభను సజావుగా నిర్వహించడానికి లోక్‌సభ స్పీకర్ కానీ, రాజ్యసభ ఛైర్మన్ కానీ సరైన చర్యలు తీసుకున్న సూచనలు ఇటీవలి కాలంలో కనిపించలేదు. వాయిదాలే పరిష్కారంగా భావిస్తున్నారు. ఉభయసభలూ సజావుగా జరిగి ఉంటే ప్రభుత్వం అనేక సమస్యలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం కూడా చర్చలు జరగకుండా సభలు వాయిదా పడితే చాలనుకుంటోంది. అందుకే పట్టుదలగా వెళ్తోంది. ప్రతిపక్షాలు కూడా అంతే ముంకుపట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం దిశగా చర్చలు లేదా.. బిల్లులపై చర్చలు జరుపుదామన్న ఆలోచనకు రావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పతనం మరింత ఘోరం !
పార్లమెంట్ తో కాకుండా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తోంది. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల గురించి ఆలోచిస్తే… పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే అభిప్రాయం ఏర్పడుతుంది. తెలంగాణలో కానీ.. ఆంధ్రలో కానీ సమావేశాలు జరుగుతాయి. కానీ ప్రతిపక్ష పార్టీల వాయిస్ మాత్రం ఎక్కడా వినిపించరు. వారి వైపు కనీసం కెమెరాలు కూడా చూపించవు. ఇంకా వైపరీత్యం ఏమిటంటే.. అందర్నీ సస్పెండ్ చేసి పడేసి.. తమ రాజకీయ ప్రసంగాలు చేసుకుంటూ పోతున్నారు. చర్చలు జరగాల్సిన సభలో ఇతరులు లేకుండా రాజకీయ అజెండాతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ద్రోహం చేస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల కుటుంబాలకు అక్రమ సంబంధాలు అంటగట్టే వికృతం కూడా ప్రారంభమయింది. క్రిమినల్ బ్రెయిన్ ఉన్న వారే రాజకీయాల్లో రాణిస్తున్నప్పుడు.. ఇలాంటి వైపరీత్యలు ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు. పార్లమెంట్ లో కనీసం వాయిదా వేస్తున్నారు. విపక్ష సభ్యులందర్నీ సస్పెండ్ చేసి తమ సభ్యులతో తాము సభలు నిర్వహించుకునే సంప్రదాయాన్ని ఇంకా ప్రారంభించలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అవి ప్రారంభమయ్యాయి. సమున్నతమైన చర్చలే ప్రజాస్వామ్యానికి ఎంతో చేస్తాయి. కానీ చట్టసభ్యులంటే ఇప్పుడు.. దందాలు చేసుకోవడానికి ఆస్తులు పెంచుకోవడానికి… నేరాలు చేసుకోవడానికి లైసెన్స్ లాగా వాడుకుంటున్నారు. ఫలితంగా చర్చలకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీలు కూడా మాకు మెజార్టీ ఉంది ఇక చర్చలు అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
అంతిమంగా ఇది మన దేశానికి ఇక పార్లమెంట్ అవసరమా..చట్టసభలు అవసరమా అని మెజార్టీ ఉన్న వాళ్లు అనుకున్నది చేసేస్తే సరిపోతుంది కదా అన్న అభిప్రాయం కల్పిస్తోంది. ఇదే జరిగితే మన ప్రజాస్వామ్యంలో ఆత్మ పోతుందని.. నిర్జీవమైన బాడీ మాత్రమే ఉంటుంది. దాని వల్ల ప్రజలు అప్రకటిత నియంతృత్వంలోకి వెళ్లిపోతారు. ప్రజాస్వామ్య పునాదుల మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. రాజకీయ పార్టీలు.. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడితే… అవి కూడా బతుకుతాయి. లేకపోతే వారు తవ్విన గోతుల్లోనే ఆ పార్టీలు కూడా అంతరించిపోతాయి. ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యం ఆ దిశగానే పయనిస్తోంది. ప్రజలు మేలుకుంటేనే.. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా కాపాడాల్సి ఉంది.