బీజేపీ అడుగుతుందా లేదా అన్నది చూసుకోవడం లేదు.. వైసీపీ నేను మద్దతు సార్ అంటూ… చేతులెత్తేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు తగ్గిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రభుత్వంగా మార్చే బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకమని.. బీజేపీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు పెడితే దానికీ మద్దతిస్తుంది. అదీ కూడా అడగకుండానే.
ముస్లింలకు నష్టం జరగబోదని.. ఏదైనా జరిగితే తాము అండగా ఉంటామని చెబుతూ బీజేపీకి మద్దతు ప్రకటించవచ్చు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో తప్ప మరే సందర్భంలోనూ వైఎస్ఆర్సీపీ మద్దతు కావాలని అడగలేదు. కానీ.. వైసీపీ ప్రతి సందర్భంలోనూ బిల్లుకు మద్దతు ప్రకటించింది. అనుకూలంగా ఓటేసింది. రైతు చట్టాలకూ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్‌కు మద్దతు కావాలని కూడా బీజేపీ వర్గాలు వైసీపీని అడగలేదు. ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని కూడా అడగలేదు.
ఏపీలో బీజేపీ వైసీపీ ప్రత్యర్థి పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. అంతే కాదు.. ఇటీవల వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఏపీలో ఉన్నది అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి మాట్లాడింది లేదు. అయినా … బీజేపీకి మద్దతు ఇవ్వడానికి గుమ్మంలో ఎదురు చూస్తున్నారు. సీబీఐ కేసులు.. ఈడీ కేసులు.. చివరికి హత్య కేసులూ మెడకు చుట్టుకుని ఉంటే ఇంకేం చేస్తారు ?.
తాము రాష్ట్రం కోసం ఇచ్చిన బలాన్ని ఇలా కేసుల కోసం మేనేజ్ చేసుకుంటున్న వైనం చూసి సిగ్గుపడాల్సింది ఓట్లేసిన వాళ్లే.