సీఎం జగన్ రెడ్డి సభలకు పిల్లల్ని తరలించడం అనేది ఓ కామన్ ప్రాక్టీస్ లా మారిపోయింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ను ఏడాదికి నాలుగు సార్లు ఇస్తూ.. నాలుగుసార్లు బటన్లు నొక్కడానికి నాలుగు జిల్లాల్లో సభలు పెట్టి విద్యార్థుల్ని సభలకు తరలిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన కిట్లు ఇచ్చేటప్పుడు అయితే ఒకటో తరగతి పిలల్ని కూడా వదలడం లేదు. వీరందర్నీ తీసుకొచ్చిన తర్వాత జగన్ రెడ్డి బాగా చదువుకోవాలమ్మా అని చెబుతారా అంటే.. బూతులు నేర్పించి పంపుతున్నారు. పెళ్లాలు.. పెళ్లిళ్లు అంటూ.. వెటకారం మాటలు నేర్పుతున్నారు.
ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అసలు ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు చిన్న పిల్లలను తరలించవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఈ తీర్పులతో పాటు కురుపాంలో జగన్ నిర్వహించిన అమ్మఒడి సభ కు పిల్లల తరలింపుపై ముందగానే వ్యూహాత్మకంగా.. ఆర్టీఐ సమాచారం తీసుకున్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. కొత్త చీప్ జస్టిస్ గా ఇవాళే ప్రమాణం చేసిన జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం ఈ కేసును మొదటి కేసుగా విచారణ జరిపింది.
పిల్లల్ని తరలించిన విషయాన్ని అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు అతి తెలివికి పోయి.. అసలు తాము తరలించలేదని.. వారే స్వచ్చందంగా వచ్చారని చెబుతారేమోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. నిజంగానే చెబుతారని రుషికొండ విషయంలో చెప్పిన కథలను గుర్తు చేసుకుంటున్నారు.