తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన వరదలతో పెద్ద ఎత్తన నష్టం జరిగింది. వారం నుంచి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. తన వర్కింగ్ స్టైల్ ను మార్చుకోలేదు. ఆయన సమీక్షలు చేస్తున్నారని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని మీడియాకు ప్రకటనలు ఇవ్వడమే కానీ నిజమేంటో ఎవరికీ తెలియదు.
ఓ వైపు వరదల హెచ్చరికలు ఉన్నా… తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కాలేదని.. ప్రజల్ని తరలించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి. చివరికి కేంద్ర సహాయ బృందాలు, ఎన్డీఆర్ఎప్, ఆర్మీ హెలికాఫ్టర్లు వస్తే తప్ప.. కొంత మందిని కాపాడలేకపోయారు. అధికార యంత్రాగం అంతా నిస్సహాయమైపోయిందన్న విమర్శలు విపక్షాల నుంచే కాదు బాధితుల నుంచి వచ్చాయి.
వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్లో పర్యటించిన కేటీఆర్ కడెం ప్రాజెక్టు గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తన శాఖ గురించి అడగాలని సలహా ఇచ్చారు .కానీ కేటీఆర్ అన్ని శాఖల పనులు ప్రకటనలు చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు. వరంగల్ అతలాకుతలం అయినా కేసీఆర్, కేటీఆర్ అక్కడకు వెళ్లి బాధితులకు భరోసా ఇద్దామనే ఆలోచన చేయలేదు. దీంతో సహజంగానే విపక్ష నేతలు కేసీఆర్ మిస్సింగ్ అంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
అయితే ఇలాంటి రాజకీయాల్ని ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్కు తెలుసు. అందుకే కేబినెట్ భేటీ పెడుతున్నామని.. ఆర్థిక సాయం అందిస్తామన్న లీక్ ఇచ్చారు. మూడో తేదీ నుంచి అసెంబ్లీ సమవేశాలు పెడుతున్నారు. ఈ సమయంలో బాధితుల్ని ఆదుకోకుండా రాజకీయాలేమిటి అన్న విమర్శలు రాకుండా వారి కోసమే అన్నట్లుగా వీటిని పెడుతున్నారు. మొత్తంగా కేసీఆర్ వర్కింగ్ స్టైల్ అంతేనని.. ప్రజలే తెలుసుకోవాలని ఇతర పార్టీల నేతలు నిట్టూరుస్తున్నారు.