వైసీపీలో వర్గ పోరు ఊహించనంతగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఎమ్మెల్యేలు ఎవర్నీ సంపాదించుకోనివ్వకుండా తామే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో వారిపై ఇతర నేతలు రగిలిపోతున్నారు. ఈ సారి టిక్కెట్ రానివ్వబోమని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు అరవైకి పైగా ఉండటం వైసీపీ పెద్దల్ని కూడా కలవర పరుస్తోంది. రోజా వంటి నేతకే వర్గ పోరు తప్పడం లేదు. నగరిలో అంతా ఏకమై ఆమె వద్దే వద్దంటున్నారు. ఇస్తే ఓడిస్తామంటున్నారు. మంత్రుల్లో సగం మందికి ఇదే పరిస్థితి. చెల్లుబోయిన వేణు , జోగి రమేష్, అంబటి రాంబాబు సహా పలువురు మంత్రులకు ఇంటి పోరు తప్పడం లేదు.
ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన పని లేదు. జగన్ రెడ్డి టిక్కెట్ ఖరారు చేసిన నియోజకవర్గాల్లోనూ పంచాయతీ తేలడం లేదు. టెక్కలి నుంచి దువ్వాడ శీనును తప్పించి ఆయన భార్యను ఇంచార్జ్ గా పెట్టారు. హిందూపురంలో అందర్నీ దూరం పెట్టడానికి .. కొత్త నేతను తెచ్చారు. గన్నవరంలో గతంలో సెటిల్ చేసినా కొత్తగా యార్లగడ్డ రెడీ అయ్యారు. చాలా వరకూ అంతర్గతంగా ఈ వర్గ పోరాటం ఉన్న ఇప్పుడు ఎన్నికల వేడి పెరుగుతూండటంతో తెరపైకి వస్తున్నాయి. మీడియా ముందు రచ్చకు కారణం అవుతున్నాయి.
తాను చెప్పిన వ్యక్తే అభ్యర్థి అన్నట్లుగా ఉండే జగన్ రెడ్డి ఈ అసంతృప్తుల్ని లైట్ తీసుకోలేకపోతున్నారు. పిలిచి బుజ్జగిస్తున్నారు. గెలిచిన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు గెలిచి అధికారంలో ఉండి ఏం చేశారు.. మళ్లీ గెలిచి ఏం చేస్తారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే…. ఉంటే టిక్కెట్ తో ఉంటాం..లేకపోతే వేరే దారి చూసుకుంటామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిని కంట్రోల్ చేయడం… జగన్ రెడ్డికి కూడా కష్టంగా మారింది.