వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో పోలీసులు చేస్తున్న దర్యాప్తు హైకోర్టును సైతం ఆశ్చర్య పరుస్తోంది. కనీసం సీసీ టీవీ ఫుటేజీలో ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా దర్యాప్తు చేస్తున్నట్లుగా స్పష్టమయింది. దీనపైనే పోలీసులుకు నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే.. ఆయనను కాపాడటానికి పోలీసులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆయనకు బెయిల్ తెప్పించడానికి రౌడీషీట్ లేదని కూడా చెప్పుకొచ్చిన పరిస్తితులు. సరైన సమయానికి చార్జిషీట్ వేయలేదు. ఈ కారణంగానే ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. అప్పట్నుంచి మరింతగా రెచ్చిపోతున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లలోనే రాజకీయ సభలు పెట్టి ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తాను సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లుగా ఆయన అంగీకరించారు. ఆ హత్య ఒక్కరే చేసింది కాదని ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఆవేశంలో ఓ సారి నెడితే గేటుపై పడి చనిపోయారని.. తప్పేం లేదని . ..తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కాల్ డేటాలు..సాక్ష్యాలు సేకరించి.. ఎమ్మెల్సీతో పాటు.. హత్యలో పాల్గొన్న నిందితులందర్నీ అరెస్ట్ చేయాలన్న ఆలోచన పోలీసులు చేయడం లేదు. ఇతర కేసుల సంగతేమో కానీ.. ఓ దళిత యవకుడి హత్య కేసులో పోలీసులు ఇలా వ్యవహరించడం.. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గిస్తుంది. అది ఎవరికి మంచిది ?