కాంబినేషన్లని సెట్ చేయడంలో పూరి జగన్నాథ్ తరవాతే ఎవరైనా. లైగర్ ఫెయిల్ అయ్యింది కానీ, ఆ సినిమా కోసం మైక్ టైసన్‌ని రంగంలోకి దించడం మొత్తం భారతీయ చలన చిత్రసీమనే ఆకర్షించింది. ఎందుకంటే ఆ దిశగా ఎవరూ ఆలోచించలేకపోయారు. ఒకవేళ టైసన్‌ని కావాలనుకొన్నా, తనని ఎలా ఒప్పించాలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ పూరి దాన్ని సాధించాడు. లైగర్ కోసం టైసన్‌ని రంగంలోకి దింపగలిగాడు. ఇప్పుడు `ఇస్మార్ట్ శంకర్` సీక్వెల్ కోసం సంజయ్ దత్‌ని విలన్‌గా రప్పించాడు. ఇది నిజంగా `ఇస్మార్ట్ మూవ్`నే. ఈ రోజుల్లో హీరో పాత్ర కంటే విలన్ పాత్రలే బలంగా ఉంటున్నాయి. అందులోనూ పేరున్న నటీనటులు కనిపిస్తే ఆ రేంజ్ వేరు. పైగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నప్పుడు దానికి ధీటైన స్టార్ డమ్ సినిమాకి అవసరం కూడా. అందుకే తెలుగు సినిమాల్లో బాలీవుడ్ విలన్స్ మెరుస్తున్నారు. సంజయ్ దత్ చాలా కాలంగా విలన్ పాత్రలకే మొగ్గు చూపిస్తున్నాడు. ఆ కోవలో మరో సినిమా చేరినట్టైంది. అయితే పూరి సినిమాల్లో విలనిజం వేరుగా ఉంటుంది. ఆయన ఆ పాత్రల్ని ఆస్థాయిలో డిజైన్ చేస్తుంటాడు. ఇక సంజూ లాంటి నటుడు దొరికితే పూరి విజృంభణ వేరే స్థాయిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి కావల్సింది కూడా అదే. విలన్ ఫిక్సయిన ఈ ప్రాజెక్టులో హీరోయిన్లు బాకీ. ఈ కథకు ఇద్దరు హీరోయిన్లు అవసరం. ఓ స్టార్ కథానాయికతో పాటు ఓ కొత్తమ్మాయిని టీమ్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు పూరి అండ్ కో.