టాలీవుడ్ లోనే కాదు, దేశం మొత్తమ్మీద ఖరీదైన రచయితగా పేరు తెచ్చుకొన్నారు త్రివిక్రమ్. బ్రో సినిమాకి గానూ ఆయన అందుకొన్న పారితోషికం రూ.15 కోట్లు. అక్కడితో ఆగలేదు. సినిమా లాభాల్లో ఆయనకూ వాటా ఉంది. ఈ సినిమా కథ ఆయనది కాదు. ఇదో తమిళ సినిమాకి రీమేక్. త్రివిక్రమ్ రాసింది మాటలు మాత్రమే. కథలో ఆయన మార్పులూ చేర్పులూ చేయలేదు. కేవలం పవన్‌కి సంబంధించిన క్యారెక్టర్ని ఎలివేట్ చేశారంతే! అందుకోసం త్రివిక్రమ్ ఎంచుకొన్న దారి.. పవన్ పాత పాటల్ని వాడుకోవడం. బ్రో సినిమాలో పవన్‌ని ఎలివేట్ చేయాలనుకొన్న ప్రతీసారీ… పవన్ గత చిత్రాల హిట్ సాంగ్స్ వస్తూ, పోతూ ఉంటాయి. ఇదే త్రివిక్రమ్ చేసిన భారీ మార్పు. సాధారణంగా త్రివిక్రమ్ సంభాషణల్లో దిట్ట. ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడితే చాలు. అందులో బోలెడన్ని కొటేషన్లు, ప్రాసలు, పంచ్‌లూ వచ్చేస్తాయి. అలాంటిది సినిమాలో ఇంకెన్ని రాయగలరు? కానీ.. `బ్రో`లో త్రివిక్రమ్ మార్క్ ఇదీ.. అనిపించుకొనే స్థాయిలో డైలాగుల్లేకపోడం ఆయన అభిమానుల్ని సైతం బాగా నిరాశ పరిచింది. త్రివిక్రమ్ మాత్రమే రాయగలిగే మాట అనిపించుకొనే స్థాయిలో ఒక్క డైలాగ్ లేదు. నిజానికి ఇలాంటి కథ, ఓ ఫ్లాట్ ఫామ్ దొరికితే త్రివిక్రమ్ లాంటి రచయిత రెచ్చిపోతాడు. బోలెడన్ని డైలాగులు గుప్పించగలడు. కానీ.. అదేం జరగలేదు. అదలా ఉంచితే, రూ.15 కోట్లు తీసుకొని రాయగలిగిన స్టప్ అయితే ఇది కాదనిపిస్తోంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్‌ని రచయితగా ఎంచుకొన్నారు. ఆ తరవాత కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ పక్కన పెట్టాల్సివచ్చింది. బుర్రా అయితే.. ఇంతకంటే బెటర్‌గా రాయగలిగే స్కోప్ ఈ కథలో ఉంది. అందుకే బుర్రా అయినా బాగుణ్ణు… అనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.