ఉత్తమ్ కుమార్ రెడ్డి తొందరపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో .. తన దారి తాను చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయనకు తరచూ.. పార్టీలో తనపై కుట్ర జరుగుతోదంన్న సంగతి గుర్తుకు వస్తోంది. తరచూ లేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన మరో లేఖ రాశారు. బీఆర్ఎస్ లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారం వెనుక కాంగ్రెస్ లో ముఖ్య నేత ఉన్నారని చెప్పుకొచ్చారు.
రెండేళ్లుగా ఈ పరిస్థితి ఉందని.. హైకమాండ్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తమ్ చెప్పిన ఆ ముఖ్య నేత రేవంత్ రెడ్డి అని అందిరకీ తెలుసు. రేవంత్ ను టార్గెట్ చేసుకునేందుకే.. ఉత్తమ్ ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ టిక్కెట్ ను ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉత్తమ్ , ఆయన భార్య రిజర్వ్ చేసుకున్నారని.. జంప్ కొట్టడానికి కారణాలు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు.
అయితే వేరే ఏ కారణాలు అయినా అనుకున్న లక్ష్యం నెరవేరదు కాబట్టి..ఆయన రేవంత్ నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పార్టీలో తన అనుచరుల్ని అణగదొక్కుతున్నారని అంటున్నారు. ఈ కారణం చెప్పి బీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఉత్తమ్ తొందరపడుతున్నారు. మరో వారంలోనే ఆయన పార్టీ మారొచ్చని కాంగ్రెస్ లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది.