తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజులుగా వరుసగా ప్రభుత్వం సాగునీటి రంగంలో విఫలమైన విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి చేయలేకపోయింది. టీడీపీ కన్నా తక్కువే ఖర్చు పెట్టామని అంబటి రాంబాబు అంగీకరించాల్సి వచ్చింది. అంకెల్లో చెప్పడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టుల పరిస్థితిని చంద్రబాబు ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. అందుకే ఒకటో తేదీ నుంచి ప్రాజెక్టుల టూర్ ప్రారంభిస్తున్నారు. ల
ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుంది. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రారంభిస్తారు. రాయలసీమ ప్రజల తాగు,సాగు నీటి కష్టాలు తీర్చే ప్రాజెక్టులను ప్రభుత్వం ఎలా మూలన పడేసిందో వివరిస్తారు. టీడీపీ ఉన్నప్పుడు ఆయా ప్రాజెక్టుల్లో పనులు నిరంతరాయంగా జరుగుతూ ఉండేవి. గత నాలుగేళ్లుగా పనులు జరగడం లేదు. ఈ విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడం కీలకమని అనుకుంటున్నారు. టీడీపీ ఉన్నట్లయితే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆ ప్రాంత వాసుల రాత మారిపోయేదని గుర్తు చేయనున్నారు.
మళ్లీ టీడీపీ వస్తేనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని ఓటర్లకు గుర్తు చేసేలా టూర్లు పెట్టుకున్నారు. చంద్రబాబు ప్రాడెక్టుల పర్యటన తర్వాత కోస్తా ప్రాజెక్టులు.. ఆ తర్వాత పోలవరం వద్దకూ వెళ్లే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులపై పర్యటనలు పూర్తయిన తర్వాత ఆయన పారిశ్రామిక రంగంపై ప్రజెంటేషన్లు ఇచ్చి.. పర్యటనలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు . ఆ తర్వాత రోడ్లు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటివాటిపైనా చంద్రబాబు ప్రజల ముందు వాస్తవాల్ని పెడతారని చెబుతున్నారు.