బండి సంజయ్‌ను తెలంగాణలో భరించలేమని పక్కన పెట్టేసి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన హైకమాండ్.. ఆయనను ఏపీ మీదకు పంపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా కార్యదర్శలు,ప్రధాన కార్యదర్సులకు రాష్ట్రాల ఇంచార్జ్ బాధ్యతలిస్తారు. సునీల్ ధియోధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడంతో ఆయన ఇంచార్జ్ పదవి కూడా పోయినట్లయింది.
ఇప్పుడు ఎవర్ని పంపిస్తారా అని ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తూంటే.. ఢిల్లీ నుంచి బండి సంజయ్ అనే సమాధానం వచ్చింది. దీంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది. బండి సంజయ్ వర్కింగ్ స్టైల్ చూశారు కాబట్టే ఈ ఉలికిపాటు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లో ఆయన పోటీ చర్చికి, గుడికి అంటూ ప్రకటనలు చేశారు. అప్పుడే చాలా మంది హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారు.
అయితే ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఏం లేదు. కుల చిచ్చు పెట్టి వైసీపీ చలి కాచుకుంటోంది కాబట్టి మత చిచ్చు పెట్టి తాము చేయాల్సింది చేయవచ్చునని బీజేపీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటికే మత మార్పిళ్లపై ఏపీలో పెద్ద చర్చే జరుగుతోంది. బండి సంజయ్ నిజంగానే ఏపీకి ఇంచార్జ్ వచ్చి..స్ట్రాటజీల్ని ఆయనే ఖరారు చేస్తే మాత్రం బీజేపీలో దూకుడు కనిపించే అవకాశం ఉంది.