బేబీ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా సక్సెస్ మీట్ అంటే.. సినిమా గురించీ, సినిమా కోసం తాము పడిన కష్టనష్టాల గురించీ.. నటీనటులు, సాంకేతిక నిపుణులూ చెప్పుకొనే వేదిక. అయితే బేబీ ఫంక్షన్ కాస్త… చిరు అభినందన సభలా మారిపోయింది. వేదిక ఎక్కిన ప్రతీ ఒక్కరూ ‘నేను చిరంజీవి అభిమాని.. నాకు చిరంజీవే స్ఫూర్తి’ అంటూ పాఠం అందుకొన్నారు. సాయి రాజేష్, వైష్ణవి, ఆనంద్, మారుతి, ఎస్కేఎన్.. ఇలా ప్రతీ ఒక్కరూ చిరుని పొగడ్డమే కార్యక్రమంలా పెట్టుకొన్నారు. నిజానికి వీళ్లంతా చిరు ఫ్యాన్సే. తమ ముందు తమకిష్టమైన హీరో కనిపించే సరికి.. తమ అభిమానాన్నంతా చాటుకొనే ప్రయత్నం చేశారు. కాకపోతే.. అది కాస్త శ్రుతి మించింది. దాంతో చిరు కూడా తాను మైకు అందుకొన్నప్పుడు ‘ఇది బేబీ సక్సెస్ మీట్ లా లేదు..నా అభినందన సభలా ఉంది’ అంటూ తన మనసులోని మాట బయటపెట్టేశారు. తన అభిమానులంతా ఎదిగి, సినిమాలు తీసే స్థాయికి చేరుకోవడం, విజయాలు సాధించడం ఆనందంగా ఉందని, ఇలాంటి అభిమానుల్ని చూసి తాను ఎప్పుడూ గర్వపడతానని చెప్పుకొచ్చారు చిరు. తన ఫ్యాన్స్ మిగిలిన హీరోల అభిమానులతో గొడవ పడిన సందర్భాలు తనకు తెలుసని, అయితే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి, వాళ్లలోని సామాజిక సేవా కోణాన్ని బయటకు తీసుకొచ్చిన వైనాన్ని గుర్తు చేసుకొన్నారు. బేబీలో నటించిన వైష్ణవి, ఆనంద్, విరాజ్ ఆనంద్‌ల నటనని ఈ సందర్భంగా చిరు మెచ్చుకొన్నారు. ఈ ముగ్గురిలోనూ చాలా ప్రతిభ ఉందని, మరిన్ని విజయాలు అందుకొనే సత్తా కనిపించిందని కితాబిచ్చారు.