హరీష్ రావు ఓ చేపల మార్కెట్ కు వెళ్తే ఆయన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది..? గతంలో ఆంధ్రా నుంచి చేపలు వచ్చేవి ఇప్పుడు మన చెరువుల్లో పెరుగుతున్న తెలంగాణ చేపల్నే తింటున్నాం… ఇంకా ఏపీకి ఎగుమతి చేస్తున్నాం అని అంటారు. చేపల చెరువు దగ్గరకు వెళ్లినా ఇదే చెబుతారు.. చెప్పారు కూడా. ఒక్క చేపల విషయంలోనే కాదు.. ఓ రైతు దగ్గరకు వెళ్లితే… ఏపీలో కరెంట్ మోటార్లకు మీటర్లకు పెట్టారు… ఇక్కడ కేసీఆర్ తన ప్రాణాన్ని అడ్డం పెట్టి మీటర్లు పెట్టడం ఆపేశారని గొప్పులు పోతారు.. ఓ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లినా అంతే.. ఏపీలో గుంతల్లో రోడ్లు వెదుక్కోవాల్సి వస్తుందని ఇక్కడ చాలా బాగుంటాయని.. చెబుతూంటారు. దాదాపుగా ప్రతీ దాంట్లోనూ హరీష్ రావు స్టేట్ మెంట్ లో ఆంధ్రా వస్తుంది .
తెలంగాణ ఉద్యమంతో హరీష్ నాయకుడు అయ్యారు. తెలంగాణ ఉద్యమం అంటే హరీష్ కు తెలిసింది ఆంధ్రా వ్యతిరేకత పెంచడం… ఏపీపై ద్వేషం పెంచడం. అదే పంథాను రాష్ట్రం వచ్చిన తరవాత కూడా కొనసాగిస్తున్నారని.. ప్రజలను విద్వేషకులుగా మార్చి.. ఓట్లు పొందాలనే ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. తెలంగాణ చెరువుల్లో చేపల పెంచుతున్నారు.. బాగానే ఉంది… కానీ ఏపీ కంటే ఎక్కువ పెంచుతున్నామన్న పోలిక ఎందుకనేది చాలా మందికి అర్థం కాదు. నిజానికి చేపల చెరువుల్లో వేసేందుకు చేపపిల్లల కాంట్రాక్టులన్నీ గోదావరి జిల్లాల్లోని అక్వా సంస్థలకే దక్కాయి. కొన్ని చోట్ల అక్రమాలు చేశారని కూడా కేసులు నమోదయ్యాయి.
అయినా హరీష్ రావు.. చేపల్ని పెంచి ఏపీకి ఎగుమతి చేసుకుంటున్నామని… చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా హరీష్ రావు ఇంకా… ఏపీ పై వ్యాఖ్యలుచేసి రాజకీయం చేసుకుని ప్రజల్లో … ద్వేష రాజకీయాలతో ఓట్లు పొందవచ్చని అనుకుంటున్నారని ఇతర పార్టీల నేతలు అందుకే విమర్శిస్తున్నారు. అయినా హరీష్ మాత్రం ఆంధ్రా రాజకీయాల్ని … ప్రజల్ని రెచ్చగొట్టాడనికి నిరంతరాయం వాడుకుంటూనే ఉన్నారు.