తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ వేరుగా ఉంటుంది. ప్రజలకు ఏదైనా కష్టనష్టం జరిగినప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోరు. ముందుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. విపక్షాలు ఆవేశ పడి ధర్నాలు చేస్తాయి. కానీ తర్వాత ఆయన తీసుకునే ఒకే ఒక్క నిర్ణయంతో విపక్షాలు నోరెత్తలేకపోతాయి… బాధితులు కూడా పాలాభిషేకాలు చేస్తారు. ఆయన తీసుకునే స్టన్నింగ్ నిర్ణయాలేమిటంటే ఎవరూ ఊహించనంత నష్టపరిహారం ప్రకటించడం. ఇస్తారాలేదా అన్నది తర్వాత సంగతి కానీప్రకటనతోనే మైనస్ ని ప్లస్ చేసుకుంటారు.
గతంలో హైదరాబాద్ వరదలైనా.. . రెండు నెలల కిందట వచ్చిన అకాల వర్షాలైనా కేసీఆర్ గవర్నెన్స్ విఫలమయిందన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కానీ కేసీఆర్ హైదరాబాద్లో ఇంటికి రూ. పదివేలు.. పంట సాయంగా ఎకరానికి రూ. పదివేలు ప్రకటించారు. ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నా సరే.. ప్రకటన చేసిన తర్వాత నెల రోజు పాటు.. ప్రభుత్వ వైఫల్యం గురించి అంతా మర్చిపోయారు. ఆ తర్వాత కూడా ప్రకటించిన పరిహారం ఇవ్వలేదనే అంటారు కానీ .. వరదల్లో ప్రజల్ని గాలికి వదిలేశారని ఎవరూ విమర్శించారు.
ఈ సారి కూడా కేసీఆర్ అలాగే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఆయన కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఎవరూ ఊహించనంత పెద్ద మొత్తం పరిహారం ప్రకటిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు కీలకం. ఈ సారి వరదల వల్ల మైనస్ అయితే ఇబ్బంది అవుతుంది.. పట్టించుకోలేదనే విమర్శలు రాకుండా… కేసీఆర్ భారీ పరిహారం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. పనిలో పనిగా కేంద్రం పైసా కూడా ఇవ్వలేదని విమర్శించడానికి చాయిస్ కూడా ఉంటుంది.