ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా గెలిచిన దిల్ రాజుకు ఎన్నికల్లో గెలుపు కిక్ ఎలా ఉంటుందో తెలిసినట్లుగా ఉంది.. సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు. ఎంపీగా పోటీ చేసినా గెలుస్తానంటూ ప్రకటనలు ప్రారంభించారు. దిల్ రాజుకు రాజకీయ ఆశలు ఉన్నట్లుగా కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఆయన బీఆర్ఎస్లో చేరుతారని.. లేదు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఏది ఇంకా వాస్తవంలోకి రాలేదు. దిల్ రాజు నేరుగా ఎప్పుడూ ఏ పార్టీతోనూ కలిసి ఉన్నట్లుగా కనిపించలేదు.
దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లా. ఆయన తన సొంత ఊరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టించడమే కాదు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. బీఆర్ఎస్లో చేరాలంటే.. నిజామాబాద్ సీటు వచ్చే అవకాశం లేదు. ఆ సీటు కల్వకుంట్ల కవితకు రిజర్వ్ చేసి ఉంటుంది. అందుకే ఆయన చూపు కాంగ్రెస్ వైపు ఉందని చెబుతున్నారు . కాంగ్రెస్ తరపున మధుయాష్కీ గౌడ్ ఉన్నారు. కానీ ఆయన ఒక్క సారి గెలిచి ప్రతీ సారి ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు.
అందుకే ఈ సారి ఆయన అభ్యర్థిత్వంపై డౌట్ ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో క్రేజ్ ఉన్న దిల్ రాజును అభ్యర్థిగా ఎంపిక చేసుకుంటే… బాగుంటుందనే సూచనలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.. తాను రెడీగా ఉన్నానన్న సంకేతాలను ఆయన పంపుతున్నారు. దిల్ రాజు సూచనలను అందుకుని కాంగ్రెస్ నేతలు చొరవ తీసుకుంటే… ఎంపీ బరిలో దిల్ రాజు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.