కొన్నాళ్ల కింద ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. ఉద్యమంలో ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కానీ కేసీఆర్ సమస్యే లేదన్నారు. ఉద్యోగులందర్నీ తొలగించినంత పని చేశారు. ఆ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు కొంత మమంది మనోవేదనతో చనిపోయారు కూడా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. అప్పట్లో ఆర్టీసీ ఉద్యోగులకు తగిలిన షాక్ తో మళ్లీ ఉద్యమబాట పట్టలేదు. కానీ ఇప్పుడు వారెవరూ అడగకుండానే ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు. అందుకే ఏపీలోలా ఆర్టీసీని అంతే ఉంచి ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వంలో భాగం చేస్తారు. ఏం చేయాలి. ఎలా చేయాలన్నదానిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఆర్టీసీలో పని చేసే ఉద్యోగులు… ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వారు ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉంటారు . కానీ ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులకు హైదరాబాద్లో తప్ప ఇతర జిల్లాల్లో సమయానికి జీతాలు రావడం లేదు. ఆర్టీసీ వాళ్ల పరిస్థితి అంతే. జీతం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతరేకత ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. అయితే మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం అమల్లోకి వస్తుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.