సినిమా వాళ్లకు రాజకీయాలంటే మోజు. అందుకే… కెరీర్ చివర్లో అయినా, రాజకీయ రంగప్రవేశం గురించి ఆలోచిస్తుంటారు. మరి రాజకీయ నాయకులకేమో సినిమా వాళ్లంలో లోకు. సినిమా వాళ్లని తమ అవసరాల కోసం వాడుకొన్నంత సేపూ.. వాడుకొంటారు. ఆ తరవాత.. తెప్ప తగలేస్తారు. స్టార్లు తెరపై నటిస్తుంటే నేతలు మాత్రం కెమెరా లేకపోయినా విజృంభిస్తుంటారు. వాళ్లని మించిన నటులే లేరు. ఎప్పుడైతే సినిమా – రాజకీయం ఏకం పాకం అయిపోయాయో, రెండింటినీ విడదీసి చూడడం కష్టమైపోయింది.
బ్రో సినిమా వచ్చింది. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులకే ఛాన్సు లేదు. అసలు సెటైర్లు పడే స్కోప్ లేదు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లో అయితే ఎంతో కొంత పొలిటికల్ టచ్ ఉంటుంది. అందులో పొలిటికల్ డైలాగులు పేల్చినా ఎవరూ పట్టించుకోరు. పెద్ద డిస్కర్షన్ ఉండదు. బ్రో లాంటి కథలో కావాలని పొలిటికల్ సెటైర్లు ఇరికించడం, అంబటి రాంబాబు ఎపిసోడ్ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. అందరి వేళ్లూ ఇప్పుడు త్రివిక్రమ్ ని ఎత్తి చూపిస్తున్నాయి. నిజానికి ఇదంతా అనవసరమైన రాద్దాంతం. పవన్ కల్యాణ్ స్థాయికి, తన సినిమాలో అంబటి రాంబాబుని పోలిన పాత్ర డిజైన్ చేసుకోవడం, తనపై సెటైర్లు వేయడం సరికాదు. అంబటికి లేనిపోని మైలేజీ ఇచ్చినట్టు అయ్యింది. దానికి తోడు అంబటి తిరిగి కౌంటర్లు వేయడానికి కావల్సినంత స్కోప్ స్వయంగా ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఎపిసోడ్ వల్ల సినిమాకీ, కథకు ఒరిగింది ఏమైనా ఉందంటే… అదీ లేదు. ఓ రకంగా ఈ విషయంలో బ్రో చిత్రబృందానిదే తప్పు.
ఇక అంబటి రాంబాబు విషయానికొద్దాం. నిన్న ఆయనో ట్విట్ చేశారు. బ్రో వల్ల ప్రొడ్యూసర్ గుల్లయ్యాడని, ప్యాకేజీ స్టార్ జేబులు ఫుల్లయ్యాయని ఓ కామెంట్ పెట్టారు. సినిమా వల్ల నిర్మాతలు నష్టపోయారని, హీరో లాభపడ్డాడని ఆయన ఉద్దేశ్యం. ఏపీ రాజకీయాల్లో, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడు సినిమాని, అందులో ఓ హీరోని టార్గెట్ చేసి ట్వీట్ చేయడం ఏమిటి? ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఓ సినిమాని కార్నర్ చేయడం ఏమిటి? ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? పవన్ కల్యాణ సినిమాని సినిమాగా చూడకపోవడం తప్పే. మరి అంబటి ఏం చేశాడు? అసలు సినిమాల ఊసు తనకెందుకు? రాజకీయాల్లో సినిమాల్ని ఎందుకు లాక్కొస్తున్నారు..? ఈ విషయయంలో ఇప్పుడు తప్పు ఇద్దరిదీ అయి కూర్చుంది. ఏపీ మంత్రులకు, నేతలకు ప్రజా సమస్యలు పట్టవు. వాళ్ల టార్గెట్ ఎప్పుడూ పవన్ కల్యాణే. ఈ విషయం అంబటి ట్వీట్ తో మరోసారి నిరూపితమైంది. సినిమాని సినిమాగా చూడనంత కాలం సినిమాలూ, రాజకీయాల్ని రాజకీయాలుగా చూడనంత కాలం రాజకీయాలూ బాగుపడవు. ఈ విషయం అటు హీరోలూ, ఇటు నేతలూ అర్థం చేసుకోవాలి.