ఈమధ్య ఓటీటీల్లో విచ్చలవిడి శృంగారం, బూతులు, హింస రాజ్యమేలుతున్నాయి. కథకు అవసరం ఉన్నా, లేకపోయినా న్యూడిటీ దర్శనమిస్తోంది. సినిమాలకంటే ఓటీటీల్లో ఎక్కువ కనిపిస్తున్న జేడీ చక్రవర్తి ఈ విచ్చలవిడి శృంగారపు సన్నివేశాలపై తనదైన శైలిలో స్పందించారు.
”నాలుగ్గోడల మధ్య జరిగే ప్రైవేటు కార్యక్రమం శృంగారం. దాన్ని తెరపై టికెట్ పెట్టి చూపించాలనుకోవడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి సన్నివేశాల్లో నటించను” అని తెగేసి చెప్పారు. ఈమధ్య ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తన దగ్గరకు వచ్చిందని, దాన్ని తిరస్కరించానని జేడీ అన్నారు. ఓటీటీలకు సెన్సార్ అవసరం ఉందా, లేదా? అనే విషయంపైనా జేడీ మాట్లాడారు. ”సెన్సార్ కాదు.. దర్శకుడి బుర్రకు సెన్సార్స్ ఉండాలి. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది తెలియాలి. ఈమధ్యే ఓ వెబ్ సిరీస్ చూశాను. అందులో తొలి సన్నివేశం శృంగార భరిత సన్నివేశంతో మొదలవుతుంది. ఆ తరవాత ఓ మర్డర్ జరుగుతుంది. అక్కడి నుంచి కథలోకి వెళ్లాడు. ఫస్ట్ సీన్లో చూపించిన శ్రుంగారానికీ, ఆ మర్డర్కీ సంబంధమే లేదు. ఆ సీన్ లేకపోయినా కథలోకి వెళ్లిపోవొచ్చు. ఇలాంటి సీన్లు ఉండాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. బూతులు ఉంటేనే సినిమాలు హిట్టవుతాయి, సెక్స్ ఉంటేనే వెబ్ సిరీస్లు చూస్తారు అనే విషయాన్ని నేను నమ్మను” అన్నారు. ఆయన నటించిన ‘దయా’ అనే వెబ్ సిరీస్ ఈనెల 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బూతులకు, సెక్స్ సన్నివేశాలరకు ఆస్కారమే లేదట. ”మన సినిమాలో బూతులు ఎందుకు లేవు? అని దర్శకుడు పవన్ సాధినేనిని నేను అడిగాను. నా పెన్ను బూతులు రాయదు అని సమాధానం ఇచ్చాడు. దర్శకులంతా అలా ఉంటే మంచిది” అని హితవు పలికాడు జేడీ. వర్మ ప్రియ శిష్యుడై ఉండి, బూతులు వద్దు, సెక్స్ వద్దు అని చెప్పడం కాస్త విడ్డూరమే. కానీ ఎవరి శైలి వాళ్లది కదా..? ఈ విషయంలో వర్శ కంటే జేడీ ఆలోచనలే బెటర్.