తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాదికోసారి ఇదిగో రుణమాఫీ అంటూంటారు. వచ్చే ఏడాది అలా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే రుణమాఫీ హామీ ఇచ్చి ఐదేళ్లు అవుతోంది. మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. రైతుల ఆగ్రహం ఊహించనంతగా ఉందని అర్థమైయిందేమో కానీ వెంటనే రుణమాఫీ హామీని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. గురువారం నుంచి రైతు రుణమాఫీ పునఃప్రారంభం అవుతుందని ప్రకటించారు. గతంలో కొంత మందికి రుణమాఫీ చేశామని ఇంకా రూ. 19 వేల కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని ఇది వచ్చే నెల రెండో వారానికల్లా పూర్తి చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు.
ఇంత కాలం ఎందుకు ఆలస్యం అయిందంటే.. బీజేపీ వల్లేనంటున్నారు కేసీఆర్. కేంద్రం తీరువల్లే రుణమాఫీ ఆలస్యం అయిందని కేసీఆర్ ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోతపెట్టింది. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరిగిందన్నారు. మరో రూ.19 వేల కోట్లు రైతులకు అందించాల్సి ఉంది.సెప్టెంబర్ 2వ వారం లోపు రుణమాఫీ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికిప్పుడు నెలలో రుణమాఫీకే 19 వేల కోట్ల రూపాయలు సమీకరించాల్సి ఉంది. ఇది ఒక్క రుణమాఫీకే. ఇంకా దళిత బందు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో లక్షలు పంచాల్సిన పథకాలు ఉన్నాయి. కనీసం చ్చే నెలలో జీతభత్యాలు కాకుండానే పాతిక వేల కోట్లు అవసరం మరి. కేంద్రం ఇప్పుడు కనికరించి.. ఎక్కువ అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందేమో కానీ.. కేసీఆర్ మాత్రం. రుణమాఫీ హామీని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేశారు.