వైయస్ రాజ శేఖర్ రెడ్డి తనయ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో తన తదుపరి అడుగులు ఎటు వైపు వేయాలి అన్న స్పష్టత కూడా లేని, దిక్కు తోచని స్థితిలో షర్మిల ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
బిజెపి లోపాయికారి మద్దతుతో పార్టీ?
తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలను అని తనకు తాను భావించేసుకుని, వైఎస్ఆర్ టీపీ అన్న పేరుతో సొంత పార్టీ పెట్టిన షర్మిల కి మొదట్లో మీడియా నుండి బలమైన మద్దతు లభించింది. అఫ్ కోర్స్, వందల కోట్ల ఆస్తి ఉన్న షర్మిల పెట్టిన పార్టీ మీడియా సంస్థలకు కల్ప తరువుగా మారింది అన్న కామెంట్స్ కూడా వచ్చాయి అనుకోండి అది వేరే విషయం. అయితే పార్టీ పెట్టిన కొత్త లో కేసీఆర్ మీద అనేక విమర్శనాస్త్రాలు సంధించింది షర్మిల. పార్టీ పెట్టిన మొదట్లో తన కి బిజెపి లోపాయికారి గా సహకరించింది అన్న పుకార్లు కూడా వినిపించాయి. షర్మిల సాధించే అతి కొద్ది ఓట్లు సైతం బిజెపి ఓటు బ్యాంకుకు సంబంధం లేని ఓట్లు అని, ఆమె చీల్చే ప్రతి ఓటు కూడా కెసిఆర్ ఖాతాలో నుంచే అన్న ఉద్దేశం తోనే బిజెపి షర్మిలకు లోపాయికారీ గా సహకరించింది అన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే ఇటీవల కెసిఆర్ చక్రం తిప్పి బిజెపి తో తన సంబంధాలను మెరుగుపరుచుకున్నాడు అని, అందుకే దూకుడు గా ఉన్న బండి సంజయ్ ని మార్చి బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారని, అలాగే కవిత కేసు అటకెక్కిందని, దీనికి ప్రతిఫలంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో అధికారికంగానే బిజెపికి మద్దతు పలుకుతాడని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మారిన రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్ వైపు షర్మిల చూపు:
అయితే ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, కెసిఆర్ బిజెపిల మధ్య సమీకరణాల లో మార్పులు జరగడం తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ కు బిజెపి నామ్ కే వాస్తే పోటీ ఇవ్వడం ఖరారు కావడంతో అటు షర్మిలకు ముందుగా బీజేపీ వాగ్దానం చేసిన సహాయ సహకారాలు కూడా ప్రస్తుతానికి అటకెక్కాయని, ఈ విషయమై షర్మిలకు పూర్తి స్పష్టత రావడంతోనే బిజెపి ని వదిలేసి కాంగ్రెస్ మద్దతు కోసం షర్మిల డికె శివకుమార్ ద్వారా ప్రయత్నించిందని తెలుస్తోంది. అయితే అసలే అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ గా ఉండే కాంగ్రెస్ పార్టీలో ని పలువురు నాయకులు షర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ బాహాటంగా నే ప్రకటనలు చేయడం మొదలు పెట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం షర్మిల పంపుతున్న రాయబారాలను ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లో పెట్టేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు షర్మిల ముందు మిగిలిన ఆప్షన్లు:
అటు కాంగ్రెస్ ఇటు బిజెపి రెండు పార్టీలు కూడా షర్మిల ని కూరలో కరివేపాకు ని తీసి పక్కన పడేసినట్లు పక్కన పెట్టడంతో ప్రస్తుతానికి షర్మిల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీ పెట్టాము కాబట్టి ఒంటరిగానే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అంటే మరీ ఘోర ప్రభావం ఎదురవుతుందేమోనన్న అనుమానం షర్మిలకు తొలుస్తున్నట్లు సమాచారం. పోనీ కెసిఆర్ తో రాజీ పడదాం అనుకుంటే దానివల్ల కెసిఆర్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోవడంతో అందుకు కనీసం ఒక శాతం కూడా అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మూడవ ఆప్షన్ తెలంగాణలో దుకాణం సర్దేసి ఆంధ్ర రాజకీయాల మీద ఫోకస్ చేయడం. అయితే పార్టీ పెట్టిన కొత్తలో తన భవిష్యత్తు తెలంగాణలోనే అన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ని – పక్క రాష్ట్రమని, తనకు సంబంధం లేని రాష్ట్రం అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆ ఆప్షన్ కూడా పోయినట్లేనని తెలుస్తోంది. మొత్తం మీద తన రాజకీయ భవిష్యత్తుపై ఏ కోశానా ఆశాజనకమైన పరిస్థితి కనిపించకపోవడంతో రాబోయే తెలంగాణ ఎన్నికలలో షర్మిల పోటీకి దూరంగా ఉండడం ద్వారా పరువు పోగొట్టుకోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి ప్రస్తుతానికి అయితే పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్న షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూడాలి.