ఏపీ బీజేపీ విషయంలో హైకమాండ్ ఏం చేయాలనుకుంటుందో స్పష్టత లేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీతో ఇప్పటి వరకు జరిపిన హనీమూన్ ను ముగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతనే పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారని చాలా మంది అనుకున్నారు. పురందేశ్వరి బాధ్యతలు చేపట్టగానే దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ వైసీపీకి సహకారం మాత్రం ఢిల్లీ స్థాయిలో అందుతోంది. దీంతో ఇక్కడ రాష్ట్ర నేతలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పురందేశ్వరి చేసిన ఆరోపణలపై.. వైసీపీ మీడియా చేసిన ప్రకటనలకు తగ్గట్లుగానే నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు ఏపీలో బీజేపీ అంటే వైసీపీనా అనుకున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ అప్పులు బహిరంగ రహస్యం. ఊరూవాడా తాకట్టు పెట్టేసి వేల కోట్లు తెచ్చారు. ఆర్బఐ దగ్గర అప్పు తీసుకురానిదే రోజు గడవదు. ఇదంతా కేంద్ర సహకారంతోనే నడుస్తోంది. అలాంటప్పుడు… వైసీపీతో సాప్ట్ గా ఉండే సోము వీర్రాజును కంటిన్యూ చేసుకుని ఉండే సరిపోయేదిగా.. మళ్లీ పురందేశ్వరిని తెచ్చి వైసీపీపై విమర్శలు చేయంచి.. వాటిని తామే డిఫెండ్ చేయడం ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు.
ముందుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ ఓ స్పష్టతకు రావాలని.. ఆ తర్వాతే.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలని అంటున్నారు. ఏపీలో అన్ని రకాల అక్రమాలు జరుగుతున్నాయని పోరాటం చేయాలని సూచించడం… మళ్లీ ఆ అక్రమాలపై ప్రశ్నిస్తే.. కేంద్రమే అధికార పద్దతులో వైసీపీకి అనుకూలంగా సమాచారం రిలీజ్ చేయడం అంటే సొంత నేతల్ని కించపర్చడమేనని గుర్తు చేస్తున్నారు. వైసీపీ హైకమాండ్ ఈ స్ట్రాటజీ మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు.