చేతకానోడికి పదవి ఇస్తే.. ఎక్కడికి అయినా వెళ్లి చేసేది ఏముంటుంది? జరిగేదేదో జరుగుతుంది..తాను మాత్రం ఏం చేస్తానని చేతులు కట్టుకుని కూర్చుంటాడు. దీనికి మళ్లీ తాను వచ్చి ఏం చేస్తాననే సమర్థన.. పైగా తాను అడ్డం అవుతానని.. నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. తాను ఎందుకు పనికి రాని వ్యక్తినని.. ముఖ్యమై నపనుల్లో అడ్డం అవుతానని ఒప్పుకునే గట్స్ కొంత మందికే ఉంటాయి. అలాంటి వారిలో ఏపీసీఎం జగన్ రెడ్డి ఒకరు. వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎందుకు పోవాలి.. బాధితుల్ని ఎందుకు పరామర్శించాలి.. ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలు ఎవరు చేస్తారు ? అని ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు.
గతంలో సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి.. కానీ పట్టించుకోలేదు. పైగా అసెంబ్లీలో ఇదేవాదన వినిపించారు. ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని.. సీఎం అక్కడకు వెళ్తే అధికారులంతా ఆయన వెంటే ఉంటారని ఇక సహాయ చర్యలు ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించుకొచ్చారు. అంటే జగన్ రెడ్డి వెళ్లాలంటే చెట్లు కొట్టాలి…పరదాలు పెట్టాలి.. హెలిప్యాడ్ సిద్ధం చేయాలి… ఇంకా ప్రోటోకాల్ ప్రకారం అన్నీ ఉండాలి.. లేకపోతే వెళ్లరన్నమాట.
ఇప్పుడు గోదావరి వరదలకూ అదే సమాధానం చెబుతున్నారు. విపత్తులు వస్తే అధికారులు వేగంగా పని చేయాలంటే.. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే ప్రజలు పడే పాట్లు గురించి చెప్పాల్సిన పని లేదు. గోదావరి గ్రామాలకు జగన్ రెడ్డి వెళ్లకపోవడానికి కారణం వారు తిరగబడి బూతులు అందుకుంటారనే. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల వాసులకు ఇచ్చిన హామీలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇవ్వడం లేదు. నిరసన వ్యక్తమవుతుందనే ఆగిపోతున్నారు. అయినా తాను వెళ్తేపనులు జరగవని నిస్సిగ్గుగా కవర్ చేసుకుంటున్నారు.