తెలంగాణ బీజేపీ కరువులో ఉంది. ఎవరు వస్తారా చేర్చేసుకుందామని చూస్తోంది. చివరికి ఈడీ కేసుల్లో ఇరుక్కున్న చీకోటి ప్రవీణ్నూ చేర్చుకోవడానికి వెనుకాడటం లేదు. చీకోటి ప్రవీణ్‌ను వెంట బెట్టుకుని బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నుంచి చికోటి ప్రవీణ్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా క్యాసినోలు నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను పెంచుకోవడం సహా అనేక కేసుల్లో ఉన్న చికోటి ప్రవీణ్ ను.. బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
రేషన్ షాపు నిర్వహించడం నుంచి మొదలైన చికోటి ప్రవీణ్ జీవితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఆ తర్వాత క్యాసినోలు నిర్వహించడం, రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సంబంధాలు నెరపడం వరకు సాగింది. చికోటి ప్రవీణ్ పై ఈడీ కేసులు నమోదయ్యాయి.ఇటీవల బ్యాంకాక్లోనూ పట్టుబడ్డారు. బోనాల పండగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్మెన్లతో వెళ్లారు చికోటి ప్రవీణ్. ముగ్గురు గన్ మెన్లతో వచ్చి హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ముగ్గురు గన్ మెన్ల వద్ద ఫార్జరీ లైసెన్సులు ఉండటంతో వారితోపాటు చికోటి ప్రవీణ్ పై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. హైదరాబాద్, ఏపీ తో పాటు థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహరాల్లో కూడా చికోటి ప్రవీణ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. హిందుత్వ కోసం పని చేస్తున్నా అని చెప్పుకునే చికోటి ప్రవీణ్.. బీజేపీలో చేరితే కేసుల నుంచి రక్షణ ఉంటుందని ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.